10వ తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్‌జీ గేమ్

0
1504

పబ్‌జీ గేమ్ కి అలవాటు పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. నిన్నటికి నిన్న పబ్‌జీ గేమ్ ఆడడానికి రీఛార్జి కోసం డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే నరికాడు ఓ యువకుడు. తాజాగా విశాఖపట్నం లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో పబ్‌జీ గేమ్ 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు బలికొంది. చినకోరాడ ప్రాంత సమీపంలో బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు లోహిత్‌ (14) 10వ తరగతి చదువుతున్నాడు. గత కొన్నాళ్లుగా పబ్‌జీ గేమ్ కి బానిస అయి చదువు పట్ల శ్రద్ద వహించడం లేదు.

దీనితో గత నెల 20న అతడి తల్లి త్రివేణి మందలించి అతడి వద్దనుండి సెల్‌ఫోన్‌ లాక్కుంది. మనస్థాపానికి గురి అయిన ఆ బాలుడు చీమలమందు నీటిలో కలుపుకుని తాగాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లితండ్రులు హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో నగరంలోని మరో ఆస్పత్రిలో చేర్పించారు. అయినా కూడా బాలుడు పరిస్థితి విషమించడంతో.. కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటనపై బాలుడి మేనమామ పులి సూరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు.