మెగాస్టార్ చిరంజీవి ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రం కోసం పూరి జగన్నాధ్‌కి అవకాశం దక్కే అవకాశం ఉంది అని అందరు భావించినా, ఆ ప్రాజెక్ట్ వి.వి. వినాయక్‌కి వెళ్లింది. కారణం, అప్పట్లో పూరి దగ్గర చిరంజీవి స్థాయికి సరిపోయే కథ సిద్ధంగా లేకపోవడం. అయితే, అప్పటి నుంచే చిరంజీవితో సినిమా చేసే అవకాశం కోసం పూరి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే పూరి చిరంజీవికి “ఆటో జానీ” అనే కథ వినిపించారు. కథ మొదటి భాగం చిరంజీవికి నచ్చినా, రెండవ భాగంలో మార్పులు చేయాలని చిరంజీవి సూచించారు. ఆ మార్పుల కోసం పూరి తిరిగి ప్రయత్నం చేయకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఈ లోపు మెగాస్టార్ ఇతర దర్శకులతో పలు సినిమాలు చేసినా, పూరి జగన్నాధ్‌తో మాత్రం సినిమా పట్టాలెక్కలేదు.
అయితే, “గాడ్ ఫాదర్” సినిమా కోసం చిరంజీవి విజ్ఞప్తి చేయడంతో, పూరి ఒక గెస్ట్ రోల్‌కి ఒప్పుకున్నారు. మెగాస్టార్ మాటను కాదనలేక పూరి తొలిసారిగా ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, పూరి-చిరు మధ్య బాండింగ్ ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా, పూరి జగన్నాధ్ “ఆటో జానీ” కథను మళ్లీ ప్రస్తావనలోకి తెచ్చినట్టు సమాచారం. మెగాస్టార్ సూచనల మేరకు రెండవ భాగంలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం పూరి గోపీచంద్‌తో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఆ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో “ఆటో జానీ” కథను మళ్లీ మలచడంపై పూరి దృష్టి పెట్టారు.
పూరి జగన్నాధ్ స్క్రిప్ట్‌లు రాయడంలో ఎంతో వేగంగా ఉంటారు. సరైన లైన్ దొరికితే, తక్కువ సమయంలోనే స్క్రిప్ట్‌ను పూర్తి చేస్తారు. చిరంజీవితో సినిమా తీయడం పూరికి ఎప్పటి నుంచో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. “150వ సినిమా కాకపోయినా, 160తో అయినా అన్నయ్యతో సినిమా చేసి నా మాట నిలబెట్టుకుంటా” అని పూరి అప్పట్లోనే అన్నారు. “ఆటో జానీ” పూరి జగన్నాధ్ కంబ్యాక్‌కు గ్రాండ్‌గా నిలుస్తుందని ఆయన సన్నిహితులు ధీమాగా భావిస్తున్నారు. అభిమానులు ఈ కాంబినేషన్‌ను తెరపై చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.