ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ఆదరణను పొందడం విశేషం. ప్రత్యేకించి, నార్త్ ఇండియాలో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు, సినిమాను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు.
ఇప్పుడు, ‘పుష్ప 2’ ఐదో వారంలోకి అడుగుపెడుతోంది. జనవరిలో కూడా సినిమాపై ఆసక్తి కొనసాగించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా, సినిమాకు అదనంగా 18 నిమిషాల నిడివి ఉన్న సీన్స్ జోడించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎడిటింగ్ రూమ్ లో ఈ కొత్త కంటెంట్ పై మేకర్స్ కసరత్తు చేస్తున్నారని టాక్. అయితే, ఈ సీన్స్ థియేటర్ వెర్షన్ లో జతచేస్తారా లేక ఓటీటీ కోసం మిగిలిస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇప్పటికే కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అయితే ఈ కొత్త కంటెంట్ థియేటర్స్ లోకి వస్తే, సినిమాకు మళ్లీ క్రేజ్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. కొత్త సీన్స్ ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉందని మేకర్స్ కూడా ఆశిస్తున్నారు. సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న ఈ సమయంలో, ఈ అదనపు సీన్స్ సినిమా వసూళ్లను మరింత పెంచే అవకాశాన్ని కల్పించవచ్చు.
అయితే, ఈ కొత్త కంటెంట్ గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిత్రబృందం ప్రమోషన్స్ కు దూరంగా ఉంది. అభిమానులు మేకర్స్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ కోసం ఆశగా ఉన్నారు. ఈ 18 నిమిషాల సీక్వెన్స్ సినిమాలోని ఏ భాగం గురించి ఉందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలో ‘పుష్ప 2’ విడుదలకు ఇప్పటికీ ఎనిమిది వారాల సమయం ఉంది. అయితే థియేటర్ ప్రింట్ కోసం ఈ కొత్త సీన్స్ జోడిస్తే, సినిమా మరికొన్ని రోజులు ఆడే అవకాశం ఉంటుంది, ప్రేక్షకులు తిరిగి థియేటర్స్ కి రావచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రం మళ్లీ వసూళ్ల హవాను కొనసాగిస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.