ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ అన్ని భాషల్లో విజయవంతంగా దూసుకుపోతోంది. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలు ఆశించిన ప్రభావం చూపించకపోవడం, ఈ చిత్రానికి మరింత ఉపయోగకరంగా మారింది. మలయాళంలో ‘మార్కో’ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నా, ఇతర చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, ప్రేక్షకులు క్రిస్మస్ సెలవుల్లో ‘పుష్ప 2’ను తిరిగి చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా 1700 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, లాంగ్ రన్ లో ‘బాహుబలి 2’ స్థాయికి చేరుకునే అవకాశముంది. ముఖ్యంగా హిందీ భాషలో ఈ సినిమా వసూళ్లు చారిత్రక స్థాయిలో కొనసాగుతున్నాయి. హిందీలో ఇప్పటి వరకు సుమారు 930 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ‘పుష్ప 2,’ మరికొన్ని రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
షారుఖ్ ఖాన్ ‘జవాన్,’ ‘పఠాన్’ మాత్రమే ఇప్పటివరకు హిందీలో 1000 కోట్ల మార్కును అందుకున్నాయి. ‘పుష్ప 2’ ఈ రికార్డును సాధిస్తే, హిందీ భాషలో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి సౌత్ ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టిస్తుంది.
క్రిస్మస్ రన్‌లో కూడా ఈ చిత్రానికి పెరుగుతున్న ఆదరణను గమనిస్తే, నార్త్ ఇండియాలో 22వ రోజుకి కూడా 8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. భారీ అంచనాలతో వచ్చిన వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోవడం, ‘పుష్ప 2’ జోరుకు మరింత తోడ్పాటుగా మారింది.
హిందీ భాషలో సౌత్ సినిమాలకు ఇప్పటి వరకు లభించిన ఆదరణతో పోలిస్తే, ‘పుష్ప 2’ విజయాన్ని ఒక మైలురాయిగా భావించవచ్చు. హిందీ మార్కెట్‌లో ‘జవాన్,’ ‘పఠాన్’ తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరే మూడో చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఫీట్ సాధిస్తే, అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సౌత్ సినిమాల కీర్తిని మరింతగా పెంచే అవకాశం ఉంది.