ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-2: ది రూల్’ భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటుతుండగా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి, తనదైన హవా చూపిస్తోంది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా కెనడాలో ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. అక్కడ ‘పుష్ప-2’ దాదాపు 4.13 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టి, అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ పేరిట ఉండగా, ఇప్పుడు పుష్ప-2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.
‘పుష్ప-2’ హిందీ వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ రికార్డు ఇప్పటి వరకు ఏ హిందీ వెర్షన్ చిత్రం సాధించలేదు. ఇంతటి ఘన విజయంతో ‘పుష్ప-2’ రూ.2000 కోట్ల మార్క్ అందుకుంటుందనే అంచనాలు ట్రేడ్ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి సమయంలో పలు బిగ్గెస్ట్ సినిమాలు విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ, ‘పుష్పరాజ్’ హవా దక్షిణాది బాక్సాఫీస్‌ను ఏకపక్షంగా ఆక్రమిస్తూనే ఉంది. ఉత్తర భారతదేశంలో కూడా ఈ చిత్రం మరింత కాలం థియేట్రికల్ రన్ కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమా గురించి మాట్లాడుకుంటే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించగా, యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రత్యేక గీతంతో అలరించింది. ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు. సుకుమార్ కథనమైత్రం, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. “అసలు తగ్గేదేలే” అన్న పుష్పరాజ్ డైలాగ్ ను నిజం చేస్తూ, ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.