ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ భారీ విజయాన్ని ఆనందించే సమయంలో, బన్నీ అనేక చిక్కులను ఎదుర్కొంటున్నారు అందరికీ తెలుసు . ముఖ్యంగా, ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా జరిగిన కొన్ని సంఘటనలు బన్నీని కొంత ఇబ్బందులకు గురి చేశాయి.
మొదటగా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ అనంతరం, ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన బన్నీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఘటనకు సంబంధించి అరెస్టు, బెయిల్ పొందడం వంటి పరిణామాలు ఆల్లు అర్జున్ ను పుష్ప-2 సక్సెస్ పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వలేదు.
అయితే, తాజాగా ‘పుష్ప-2’ మూవీ విషయంలో బన్నీ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌ను సందర్శించినట్లు సమాచారం. ముఖ్యంగా, సినిమా థియేట్రికల్ వెర్షన్‌లో కొందరు ప్రేక్షకులు భావించిన కంటిన్యుటీ సమస్యల కోసం మేకర్స్ కొన్ని సన్నివేశాలను చేర్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
సినిమాలో జపాన్‌కు వెళ్లిన పుష్ప రాజ్ ఇంట్రో ఫైట్ సీన్ మధ్యలో ఆగిపోవడం వల్ల ప్రేక్షకుల్లో అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే అదనపు సన్నివేశాలు ఇప్పటికే మేకర్స్ దగ్గర సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా ఆ సన్నివేశాల కోసం డబ్బింగ్ చెబుతున్నారట.
అన్ని భాషల్లో డబ్బింగ్ పూర్తయిన తర్వాత, జనవరి 1 నుంచి ‘పుష్ప-2’ కొత్త వెర్షన్ థియేటర్లలో విడుదల కానుందని టాక్. ఈ కొత్త వెర్షన్‌లో కట్ చేసిన సన్నివేశాలు కలిపి, ఓటీటీ ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
ఈ తాజా సన్నివేశాలతో ‘పుష్ప-2’ థియేట్రికల్ రన్ మరోసారి వేగాన్ని అందుకోవచ్చని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఆడియన్స్‌లో ఈ అంశంపై ఆసక్తి పెరిగింది. కొత్త వెర్షన్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావడం ద్వారా వసూళ్లు పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ‘పుష్ప-2’ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి అదనపు వసూళ్లు సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.