
పుష్ప 2: ది రూల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 2024 డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం పుష్ప-1ను మించే స్థాయిలో విజయం సాధించి తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటించింది.
సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే పుష్ప-2 రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. సంక్రాంతి కి ముందే రూ. 1830 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సక్సెస్ ను కొనసాగించేందుకు జనవరి 17న థియేటర్లలో మరో 20 నిమిషాల అదనపు ఫుటేజ్ తో “పుష్ప-2 రీలోడెడ్” వెర్షన్ ను విడుదల చేశారు. ఈ రీ ఎడిటెడ్ వెర్షన్ తో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది.
సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ముందుగా అనేక ఊహాగానాలు వచ్చాయి. సంక్రాంతి సీజన్ లోనే ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, మేకర్స్ అఫీషియల్ గా 56 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ కి వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ లో ట్రెండ్ అవుతోంది.
సినిమాలో కథ, నటీనటుల ప్రదర్శన, టెక్నికల్ వాల్యూస్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రష్మిక మందన్న తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్, తారక్ పొన్నప్ప, అజయ్, ధనుంజయ్, శ్రీతేజ్ తదితర నటుల పాత్రలు కూడా సినిమాకు ప్రధాన బలం గా నిలిచాయి.
సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ “కిస్సిక్” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా మారాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి యలమంచిలి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరు భారీ లాభాలను అందుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత కూడా సినిమా రికార్డుల వేట కొనసాగిస్తుండటం విశేషం. “తగ్గేదేలే” అనే డైలాగ్ ను నిజం చేస్తూ పుష్ప-2 దూసుకుపోతుంది.