అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన **’పుష్ప 2: ది రూల్’** బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. విడుదలైన 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలో నూతన అధ్యాయం లిఖించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ‘బాహుబలి 2′ (రూ.1810 కోట్లు) రికార్డును అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ మార్కెట్లోను ఈ సినిమా పలు అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తూ, దేశవ్యాప్తంగా నంబర్ వన్ హిందీ మూవీగా నిలిచింది.
ఈ విజయాన్ని మరింత పెంచే దిశగా మేకర్స్ ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు. జనవరి 11, 2025 నుంచి ఈ చిత్రానికి అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ జోడించి థియేటర్లలో ప్రత్యేక రీడిటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ కొత్త వెర్షన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప 2 సినిమాకు కొత్తగా జోడించిన 20 నిమిషాల ఫుటేజ్ ప్రేక్షకులను మరింత రీడిట్రాక్ట్ చేయగలదని భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా చూసినవారు కొత్త సీన్స్ చూడాలనే ఆసక్తితో థియేటర్లకు తిరిగి రావచ్చు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల కొత్త ఆఫర్ ఇది. ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘దంగల్’ రికార్డులను కూడా బద్దలు కొట్టగలమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
సంక్రాంతికి పుష్ప 2 తో పాటు ‘గేమ్ చేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే పుష్ప 2కి తగ్గించిన టికెట్ రేట్లు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలవవచ్చు. రీలోడెడ్ వెర్షన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌పై మరింత ప్రభావం చూపుతుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ వంటి నటీనటులు తమ పాత్రలను మేలుగా పోషించారు. ‘పుష్ప 2: ది రూల్’ మరోసారి ప్రపంచ సినీ చరిత్రలో నిలిచే కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందా? రీలోడెడ్ వెర్షన్ విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.