గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు చేసి, సుదీర్ఘకాలంగా నిలిచిన ‘బాహుబలి 2’ రికార్డ్‌ను అధిగమించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తన తదుపరి లక్ష్యంగా ‘దంగల్’ సినిమా రికార్డ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో చిత్రబృందం 20 నిమిషాల కొత్త సన్నివేశాలను జతచేసి ‘రీలోడెడ్ వెర్షన్’గా విడుదల చేసింది. సంక్రాంతికి ముందు నుంచే ఈ వెర్షన్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ పెద్ద సినిమాలు థియేటర్లలో ఉండడంతో విడుదలను వాయిదా వేశారు.
జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రీలోడెడ్ వెర్షన్‌పై తొలుత కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. 20 నిమిషాల కొత్త సన్నివేశాల కోసం మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే సందేహాలు ఉన్నప్పటికీ, ‘పుష్పరాజ్’ ఫ్యాన్స్ మాత్రం భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చారు. ఆరంభ ఆట నుంచే పలు ప్రాంతాల్లో 75 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. కొత్తగా జతచేసిన సన్నివేశాలకు ప్రేక్షకులు అద్భుతంగా స్పందించారు. థియేటర్లలో అరుపులు, కేకలతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించారు.
ఈ రీలోడెడ్ వెర్షన్‌లో జపాన్‌లో జరిగే ఒక ముఖ్యమైన సన్నివేశం, సిండికేట్ సభ్యుల సమావేశం, అలాగే చివర్లో పుష్ప చిన్నప్పుడు తీసుకున్న చైన్‌ను తిరిగి పుష్ప మెడలో వేయడం వంటి సన్నివేశాలను జత చేశారు. ముఖ్యంగా ఈ చైన్ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త సన్నివేశాలు సినిమాలో గుణాత్మకతను పెంచాయి అని కొందరు అంటున్నారు, అయితే ప్రధానంగా పుష్పరాజ్ ఫ్యాన్స్ మాత్రం ఈ రీలోడెడ్ వెర్షన్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.
ఈ సమయంలో సంక్రాంతి పెద్ద సినిమాలు థియేటర్లలో ఉండటం వల్ల పుష్ప 2కి పోటీ ఉన్నప్పటికీ, రీలోడెడ్ వెర్షన్‌కు మంచి స్పందన దక్కడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ వెర్షన్ సినిమా మొత్తం రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ‘దంగల్’ రికార్డ్‌ను అధిగమించాలని అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ వారం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో కూడా సినిమా మంచి వసూళ్లు రాబడితే, ఆ లక్ష్యానికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వసూళ్ల ఆధారంగా ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా నిర్ణయించబడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద, ఈ రీలోడెడ్ వెర్షన్ ద్వారా ‘పుష్ప 2’ బజ్‌ను మరింతగా పెంచి, ప్రేక్షకుల మనసుల్లో గాఢంగా ముద్ర వేసుకుంది.