ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది మొత్తం వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా ఆతని పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆయనకు ఈ ఏడాది అంతగా అనుకూలించలేదని అని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో నంద్యాల పర్యటన కారణంగా మొదలైన వివాదాలు, ఇప్పటికీ వెంటాడుతున్నాయి . తాజాగా పుష్ప 2 చిత్ర రిలీజ్ సమయంలో జరిగిన ప్రమాదం ఆయనను మరోసారి సమస్యల లోకి నెట్టింది.
పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనకు కారణం అల్లు అర్జున్ అని పోలీసులు కేసు నమోదు చేయడం, అనంతరం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న అల్లు అర్జున్, ఈ సంఘటనపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో ఆయన ఈ ప్రమాదం యాదృచ్ఛికమని, ఇందులో ఎవరూ కావాలనే తప్పు చేయలేదని చెప్పారు. ప్రేక్షకులను ఆనందపెట్టడం తన లక్ష్యమని, ఈ ఘటన గురించి తనను బ్లేమ్ చేయవద్దని కోరారు. అయితే అదే సమయంలో ప్రెస్ మీట్లో తనే మాట్లాడతానని, ఇతరులను మాట్లాడనివ్వకుండా మీడియాను వినమని కోరడం కొన్ని విమర్శలకు దారితీసింది.
మీడియా ప్రశ్నలపై స్పందించకుండా, “ఇంకెమీ మాట్లాడినా తప్పయిపోతుంది, నా లీగల్ టీమ్ లేదా మా నాన్నను సంప్రదించండి” అని తెలిపారు. ఈ చర్యపై సోషల్ మీడియాలో రెండు విధమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది మీడియాను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తుంటే, మరికొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థించారు. అల్లు అర్జున్ మరింత వివరణ ఇస్తే ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏమీ చెప్పినా అది మరో వివాదానికి దారి తీస్తోంది.