సమయం బాగోపోతే తాడే పామై కరుస్తుందని ఊరికే అనలేదు పెద్దలు. ఒకోసారి మనం ఇతరుల మీద వేసే పంచ్‌లు అటు తిరిగి, ఇటు తిరిగి తారాజువ్వల్లా మనమీదే పడుతుంటాయి. మనం వాటిని వదిలినప్పుడు బాగానే ఉంటాయి. కానీ అవి మన మీద పడేటప్పటికి భగభగా మండుతూ ఉంటాయి. ఆ మంటను కూడా తట్టుకోవటానికి సిద్ధ పడినప్పుడే తారాజువ్వ వదలాలి.
ఇలా తమ ఎంపీపైనే అనవసరంగా వదిలిన ఓ తారాజువ్వ తిరిగి వైసీపీ అధ్యక్షుడినే తాకడంతో మన్నుతిన్న పాము లెక్కన మిన్నకుండిపోయారు వైసీపీ నేతలు. విషయంలోకి వెళితే. వైసీపీకి చెందిన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజుకు పార్టీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆయన్ను ఏకాకిని చేసిన పార్టీ ప్రత్యేక విమానం వేసుకుని మరీ ఢల్లీి వెళ్లి ఆయన్ను ఏదో చేసేద్దాం అనుకుని చతికిలపడిoది.
ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉండీ లేనట్టు, లేక ఉన్నట్టుగా ఉన్నారు. వైసీపీ మాత్రం ఆయన బీజేపీకి సన్నిహితంగా ఉన్నారని విమర్శలు చేస్తోంది. నిజానికి రఘరామకృష్ణంరాజుకు కేంద్రం పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. కేంద్రంలో అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇటు బీజేపీ ఉన్నా ఆయనదో ప్రత్యేకమైన హై సర్కిల్. అయితే తాజాగా ఓ వైసీపీ పెద్ద దగ్గర ఈయన గురించి ప్రస్తావన రాగా ‘‘ఆయనపై 1 ఎఫ్.ఐ.ఆర్ ఉంది. అందుకే ఆయన బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నాడు’’ అన్నాడట ఆ పెద్ద.
ఇదే విషయం రఘురామునికి చేరింది. దీనికి మంగళవారం ఆయన కౌంటర్ ఇస్తూ.. ‘‘నాపై 1 ఎఫ్.ఐ.ఆర్ ఉంటేనే నేను బీజేపీకి లొంగిపోయి ఉంటే.. మీ మీద 33 చార్జ్షీట్లు దాఖలు అయి ఉన్నాయి. మరి మీరు ఏ స్థాయిలో బీజేపీకి సాష్ఠాంగ పడ్డారో ఊహించగలo’’ అంటూ గట్టి కౌంటర్ పంచ్ ఇచ్చారు. అసలే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న రఘురామునితో అనవసరంగా కెలుక్కున్నామనే భావన పార్టీలో వ్యక్తం అవుతోందట.