
సూపర్‌స్టార్ రజనీకాంత్ వయసు పైబడినా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా, దృఢసంకల్పంతో సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ పెద్ద తెరపై తన హవాను కొనసాగిస్తున్నారు. భారీ పారితోషికం అందుకునే హీరోగా రజనీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ” సినిమాలో నటిస్తుండగా, ఆ తర్వాత “జైలర్ 2″లో కూడా కనిపించనున్నారు. అయితే ఇంత పెద్ద వయసులోనూ ఆయన ఎనర్జీని, సానుకూలతను ఎలా కాపాడుకుంటున్నారనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తన ఆరోగ్య రహస్యాన్ని ఇటీవల రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం, గురువుల సమక్షంలో ధ్యానం, క్రియా యోగ సాధన చేయడం వల్లే ఇప్పటికీ ఎంతో ఉల్లాసంగా, ఆత్మశాంతితో జీవించగలుగుతున్నానని చెప్పారు. అయితే క్రియా యోగా నేర్చుకోవడం అంత సులభం కాదని, దాని లోతైన ఫలితాలను అనుభవించేందుకు సుమారు 10-12 సంవత్సరాల సమయం పట్టిందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఆరంభంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రాలేదని, ఎంతో కాలం పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ధ్యానం యొక్క అసలైన శక్తిని తనకు గ్రహించే అవకాశం కలిగిందని వివరించారు.
రజనీకాంత్ 2002లో క్రియా యోగాను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది రాంచీలోని వై.ఎస్.ఎస్ ఆశ్రమాన్ని సందర్శించడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ ఏడాది కూడా ఆయన ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. గురువుల ఆశీస్సులతో రెండు రోజులు ఆశ్రమంలో గడిపే అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రత్యేకంగా, గురువు గారి గదిలో కూర్చొని ఒక గంట పాటు ధ్యానం చేసే అదృష్టం దక్కిందని చెప్పారు. ఆ ఒక్క గంటలో ధ్యానంలో మునిగిపోయిన అనుభూతిని వర్ణించలేనని, ఎలా గడిచిందో తనకే తెలియదని అన్నారు. ధ్యానం ముగిసిన తర్వాతే ప్రపంచం గురించి అవగాహన వచ్చిందని, ఈ ప్రక్రియ ఎంతో గొప్పదని వివరించారు.
రజనీకాంత్ మాట్లాడుతూ, తనను కలిసినవారు సానుకూలతను పొందుతున్నామంటూ చెప్పినప్పుడు, దానికి అసలు కారణం తాను చేస్తున్న క్రియా యోగా సాధనేనని స్పష్టం చేశారు. క్రియ యోగాను మొదలుపెట్టినప్పటి నుంచి తనలోని మార్పును మాటల్లో చెప్పలేనని, ఇది ఒక రకమైన నిశ్శబ్దమైన శాంతి అని వివరించారు. మొదట వందశాతం అర్థం కాకపోయినా, పదేళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత ఆ ప్రయోజనాన్ని అనుభవించగలిగానని తెలిపారు. ఫలితం త్వరగా రాకపోయినా, ఒకసారి ఆ మార్గాన్ని ఎంచుకున్నాక దానిని కొనసాగించాల్సిందేనని నమ్ముతానన్నారు.
క్రియా యోగా ప్రాపంచిక బాధల నుంచి మనసును వేరుచేసి, అంతర్గత శాంతిని అందించేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ఇది మనకు అర్థం కావాలంటే తప్పకుండా ఆ సాధనను మనం అనుభవించాల్సిందేనని అన్నారు. గురువులు ఒకసారి మన చేయి పట్టుకుంటే, మనం వదిలిపెట్టినా వారు విడవరని, వారే మనల్ని తమతో పాటు తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉంటారని తెలిపారు. ఈ సాధన తెలుసుకున్నవారు ఎంతో అదృష్టవంతులని, తరతరాలుగా ఈ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతియేటా తన ఆశ్రమ సందర్శనతో ఈ సాధనలో మరింత లోతుగా మునిగిపోతానని, ధ్యానమే తన జీవితంలో కీలక భాగమైందని చెప్పారు.