నటీనటులు: రామ్ చరణ్,కియారా అద్వానీ,అంజలి, ఎస్.జె.సూర్య,జయరాం,శ్రీకాంత్,సునీల్,సముద్రఖని,నవీన్ చంద్ర,వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: తిరు
కథ: కార్తీక్ సుబ్బరాజ్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: దిల్ రాజు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్
స్టోరీ:
రామ్ నందన్ (రామ్ చరణ్) విశాఖపట్నానికి కొత్త కలెక్టరుగా వచ్చిన యువ అధికారి. తన విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణతో ఆక్రమాలను అరికడతాడు. కాలేజీ రోజుల్లో ప్రేమించిన దీపిక (కియారా అద్వానీ)తో తిరిగి కలుస్తాడు. అయితే అదే సమయంలో ఆయన మాఫియా నాయకుడు మోపిదేవి (ఎస్.జె. సూర్య)తో ఢీకొంటాడు, చివరకు సస్పెండ్ అవుతాడు. ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) హఠాత్తుగా మరణించడం, రామ్‌ను అనూహ్యంగా సీఎం పదవిలోకి తెచ్చే సంచలన నిర్ణయం కథలో మలుపు. సత్యమూర్తి ఆ నిర్ణయం వెనుక రహస్యం, రామ్ కొత్త బాధ్యతలు ఎలా నిర్వహిస్తాడు అనే ఆసక్తికర అంశాలతో కథ సాగుతుంది.
రామ్ చరణ్ వంటి స్టార్ కాంబినేషన్, శంకర్ డైరెక్షన్, భారీ అంచనాలతో వచ్చిన ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల అభిరుచులకు కొంత మేర తప్పని నిరూపించింది. మంచి కథ, భారీ నిర్మాణ విలువలు ఉన్నా కథనం లో వెనకబడి, సినిమాకు సరైన బలం లభించలేదు.
అంజలి తన పాత్రలో సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. చాలా తక్కువ సన్నివేశాల్లోనే తనదైన ముద్ర వేసింది. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో శక్తిమేరకు నటించినప్పటికీ, అతని టాలెంట్ ని ఫుల్లుగా ఉపయోగించలేదు అనిపిస్తుంది. ఆయన విలన్ అంటే ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. శ్రీకాంత్ సత్యమూర్తి పాత్రలో బాగా నటించారు. సముద్రఖని సహాయ పాత్రలో రాణించారు. కానీ సునీల్, వెన్నెల కిషోర్, జయరాం వంటి ప్రముఖుల పాత్రలు ఆశించినంత ప్రభావం చూపించలేదు.
సాంకేతికంగా ‘గేమ్ చేంజర్’ కాస్త తక్కువ స్థాయిలోనే కనిపించింది. తమన్ సంగీతం పాక్షికంగా మెప్పించింది. ‘జరగండి,’ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఆకట్టుకున్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ మోస్తరుగా అనిపించింది. ధోప్ సాంగ్ బాగుంది కానీ, నానా హైరానా పాటను తీసేయడం అభిమానులకు షాక్ ఇచ్చింది. తిరు కెమెరా వర్క్ పరవాలేదనిపించినా, గొప్పగా అనిపించలేదు. సెట్స్, నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా కనిపించాయి.
కార్తీక్ సుబ్బరాజ్ కథలో కొత్తదనం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కథ మలుపు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాని తర్వాత కథనం బలహీనమైంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మామూలుగా అనిపించాయి. శంకర్ టేకింగ్‌లో గత సినిమాల మార్క్ కనిపించలేదు. ఆయన సామాజిక అంశాల జోడింపు, టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో లేవు. ఈ సినిమాను చూస్తే శంకర్ ‘ఇండియన్ 2’ తర్వాత కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది కానీ, ఈసారి ఆయన మెజిక్ మిస్ అయింది.
మొత్తానికి గేమ్ చేంజర్ భారీ అంచనాలను అందుకోలేకపోయిన సినిమా. కథలో బలం, దర్శకుడి మేజిక్ లేని ఈ సినిమా చాలా మామూలుగా సాగింది.
రేటింగ్: 2.25/5