రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు శంకర్ ఈ సినిమాను అత్యంత రిచ్‌గా రూపొందించారని టాక్ ఉంది. సినిమాపై ఉన్న ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో భాగంగా దిల్ రాజు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. రామ్ చరణ్ నుంచి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో మూవీ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమాకు గట్టి ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకునేందుకు విజయవాడలో రికార్డ్ స్థాయి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకు ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేయలేదు. యువశక్తి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ భారీ కటౌట్ నిర్మాణానికి చెన్నై నుంచి ప్రత్యేక టీం వచ్చినట్లు ఫ్యాన్స్ తెలిపారు. వారంతా దాదాపు వారం రోజుల పాటు కష్టపడి ఈ కటౌట్‌ను పూర్తి చేశారని చెప్పారు. కటౌట్లో రామ్ చరణ్ లుంగీ కట్టుకుని, బనియన్ ధరించి ఉన్న మాస్ లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. చరణ్ ఫ్యాన్స్ ఈ అరుదైన ఘనతను సాధించడంపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు నాయక్ మూవీ లో డ్యుయల్ రోల్ చేసినా..అది ఒకే ఏజ్ ఉన్న వ్యక్తులుగా చేశాడు. అయితే ఈ సారి ఒక పాత్రలో తండ్రిగా, మరొక పాత్రలో కొడుకుగా కనిపించనున్నాడు. అంజలి తండ్రి పాత్రకు జోడీగా నటించగా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్గా నటించగా, తమిళ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. రామ్ చరణ్ ఏకంగా 200 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం ఆయన శ్రద్ధకు నిదర్శనం. దర్శకుడు శంకర్ తీసుకున్న కష్టాన్ని, సినిమాకు దిల్ రాజు పెట్టిన భారీ బడ్జెట్‌ను చూస్తే, ఈ చిత్రం ఒక భారీ విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.