వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిందని తరచూ కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో రాష్ట్రం అప్పుల పాలు అయిందని, మరో శ్రీలంక అవుతుందని ఊదరగొట్టారు. ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ మాటలు నిజమని నమ్మారు. దీనితో కూటమికే 164 సీట్లు, వైసిపికి 11 సీట్లు వచ్చి.. వైసిపి ఘోర పరాజయం మూట గట్టుకుంది. అయితే కూటమి నేతలు చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని జగన్ తాజాగా లెక్కలు బయటపెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తయారీ రంగంలో ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019-24 మధ్య జీవీఏలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. అలానే జీవీఏలో 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదవ స్థానంలో ఉంది. ఇంకా పారిశ్రామిక వృద్ధిలో కూడా దక్షిణాన మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఈ లెక్కలు సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ చేస్తూ.. టీడీపీ-జనసేనలపై జగన్ మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను తరిమేసిందని నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసే ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే.. ఏపీ పనితీరు దారుణంగా ఉండేదని అన్నారు. కానీ నిజాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని.. కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయని ఎక్స్ లో లెక్కలు బయట పెట్టారు. మరి ఈ లెక్కలపై కూటమి నేతలు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

