
విశ్వక్సేన్ టాలీవుడ్‌లో ఏటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన టాలెంట్‌తోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు. అతడి అగ్రెసివ్ యాటిట్యూడ్, యువతకు కనెక్ట్ అయ్యే ధోరణి, సినిమాలను ప్రమోట్ చేసే విధానం.. వీటన్నిటి కారణంగా విశ్వాక్ కు యూత్ లో మాంచి క్రేజ్ వచ్చింది . కానీ క్రేజ్ కేవలం ఓపెనింగ్స్‌కు ప్రమోషన్లు ఎంతగానో ఉపయోగపడితే, సినిమా ఫలితాన్ని మాత్రం కంటెంట్ నిర్ణయిస్తుంది.
ఇప్పటి వరకు విశ్వక్ చేసిన సినిమాలు చూస్తే, అతను కథలు ఎన్నుకునే విషయంలో కాస్త తడబడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ, తన మార్కెట్‌ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ, కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అభిప్రాయం నెలకొంటోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన అతడి సినిమా ‘లైలా’ ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చాటింది. ఈ చిత్రం విశ్వక్ కెరీర్లోనే అత్యంత నిస్సత్తువైన చిత్రంగా నిలిచింది. సినిమాపై వచ్చిన నెగటివ్ టాక్ అతడి జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
విశ్వక్ ఇప్పటివరకు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నప్పటికీ, అతడి సినిమాలపై ఇటువంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి. ప్రేక్షకులు నెమ్మదిగా అతడిపై నమ్మకం కోల్పోతున్నారని చెప్పడానికి, అతడి సినిమాలకు వస్తున్న ఓపెనింగ్స్‌నే ఓ ప్రమాణంగా తీసుకోవచ్చు. గత ఏడాది విడుదలైన అతడి సినిమా ‘గామి’ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విశ్వక్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ఈ చిత్రంలో కంటెంట్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉండటంతో, ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి.
అయితే, తర్వాత వచ్చిన ‘దాస్ కా దమ్కీ’కు తొలి రోజు 4.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇది కూడా విశ్వక్ మార్కెట్‌ను బట్టి బాగానే ఉంది. కానీ, అదే ఏడాది చివర్లో వచ్చిన ‘మెకానిక్ రాకీ’ మాత్రం చాలా తక్కువ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు కేవలం 1.5 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
ప్రస్తుతం విడుదలైన ‘లైలా’ మొదటి రోజు కేవలం 1.25 కోట్లకే పరిమితం కావడం విశ్వక్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ స్పష్టంగా కనిపించేట్లు చేస్తోంది. ఏడాది కిందట అతడి సినిమా ఒకటి 8 కోట్లు రాబట్టగా, ఇప్పుడు అతి తక్కువ స్థాయికి పడిపోవడం ఆలోచించదగ్గ విషయం. వరుసగా సినిమాలు చేయడం కంటే, మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని, ప్రేక్షకుల నమ్మకాన్ని మళ్లీ తెచ్చుకోవడం విశ్వక్ కోసం మంచిది. అలా చేయగలిగితే, అతడి కెరీర్ మళ్లీ మంచి ఊపందుకునే అవకాశముంది.