టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్‌లో కీలకమైన చిత్రం గేమ్ ఛేంజర్ ,విడుదలకు సర్వం సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి దాదాపు రూ.350 కోట్ల ఖర్చు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా, తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. రిలీజ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్స్‌కు గేర్ పెట్టారు. ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల చేయగా, జనవరి 1న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.
ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు పాల్గొని, ప్రమోషన్స్‌లో నెక్ట్స్ స్టెప్ వివరించారు. జనవరి 1న హైదరాబాద్‌లో మరో మెగాహోస్టింగ్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. రేవంత్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తే, ఆయన వేదికపై ఏమి మాట్లాడతారన్న దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమాల పైసల్ విధానాలు, షూటింగ్ అనుమతులు వంటి అంశాలపై ఏమైనా కీలక ప్రకటనలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనంతరం గేమ్ ఛేంజర్‌పై ఉన్న హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో విడుదల కానున్న ఇతర సినిమాలపై ఈ చిత్రం ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.