![Screenshot_20250215-202440_Facebook](https://apmessenger.com/wp-content/uploads/2025/02/Screenshot_20250215-202440_Facebook-1024x612.jpg)
రామ్ గోపాల్ వర్మ తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ సినిమాల్లో ఎక్కువగా స్లో మోషన్ షాట్స్‌కే ఆధారపడతారని, అవే లేకపోతే ఆయన స్టార్‌డమ్ కొనసాగించగలరా? నటన పరంగా నిలదొక్కుకోగలరా? అనే వ్యాఖ్యలు చేసాడు.
వర్మ మాట్లాడుతూ, ఒక స్టార్‌కి, ఒక యాక్టర్‌కి తేడా ఉంటుందని, స్టార్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెప్పాడు. ముఖ్యంగా, రజినీకాంత్ సినిమాల్లో హీరో ఏమీ చేయకపోయినా, అతడి ఎంట్రీలు, స్లో మోషన్ షాట్స్ సినిమాకు హైప్ ఇచ్చేలా చేస్తాయని వర్మ అభిప్రాయపడ్డాడు. అయితే, ‘సత్య’ సినిమాలోని బిక్కు పాత్రను చూస్తే, అలాంటి పాత్ర రజినీకాంత్ చేయలేరని, ఎందుకంటే అది పూర్తిగా యాక్టింగ్ మీద ఆధారపడి ఉండే పాత్ర అని అన్నాడు.
వర్మ వ్యాఖ్యలు బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తలైవా కేవలం స్టార్ మాత్రమే కాదు, గొప్ప నటుడని, ఆయన సినిమాకు చూసి మాట్లాడాలని సోషల్ మీడియాలో వర్మకు కౌంటర్లు వేస్తున్నారు. రజినీ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాకుండా, నటన పరంగా కూడా తనదైన ముద్ర వేసుకున్నారని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
ఇది కొత్తేమీ కాదు, వర్మ తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. గతంలో మెగా ఫ్యామిలీపై కూడా అనేక విమర్శలు చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఈ మధ్య బన్నీపై ఎక్కువ ఫోకస్ పెడుతూ, ఆయనను పొగిడే క్రమంలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
వర్మ చేసే కామెంట్స్‌పై ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ స్పందించరు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇవి పెద్ద ఫ్యాన్ వార్‌కు దారి తీస్తుంటాయి. ఇప్పుడు కోలీవుడ్ అభిమానులు కూడా వర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. “రజినీ గురించి తెలుసుకో, ఆయన నటనా పరంగా ఎంత గొప్పవారో పాత సినిమాలు చూసి అర్థం చేసుకో” అంటూ వర్మపై విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం వర్మ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ గురించి ఇలాంటి కామెంట్లు చేయడం వెనుక వర్మ ఉద్దేశం ఏమిటనేది తెలియదు, కానీ దీనికి రజినీకాంత్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వర్మ దీనికి ఎలా స్పందిస్తాడో చూడాలి.