
సందీప్ రెడ్డి వంగా విభిన్న కథలు చెప్పే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తీసిన ప్రతి సినిమా బోల్డ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో తనదైన మార్క్ ఏర్పరచుకున్న సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం, సందీప్ – చిరంజీవి కాంబినేషన్.
సందీప్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం ప్రత్యేకమైనది. చిరంజీవి సినిమాల నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు పలుమార్లు ఆయన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, ‘మాస్టర్’ సినిమాలో చిరంజీవి సిగరెట్ కాల్చే సీన్ తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పిన సందీప్, ఇటీవల చిరంజీవి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మరోసారి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇద్దరి కాంబినేషన్ పై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ చిత్రంలో చిరంజీవికి ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ పాత్రను ఎంత బలంగా డిజైన్ చేసారో, చిరంజీవికి కూడా అలాగే ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఇవ్వాలని సందీప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరు కూడా తాను ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఫిక్స్ అవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
ఇటీవల హీరోలు లీడ్ రోల్స్‌తో పాటు విభిన్న పాత్రలను కూడా స్వీకరిస్తున్నారు. చిరంజీవి కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్తే, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్టవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ తన సినిమాల్లో కొత్తదనం తీసుకురావాలని చూస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా వంటి విభిన్న కథల దర్శకుడితో కలిస్తే, అది మాస్ ప్రేక్షకులకు పండగే.
ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న సందీప్ త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశముంది. అది చిరంజీవితో అయితే, టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. చిరంజీవి, సందీప్ స్టైల్‌లో ఎలా మెరవబోతారన్నది ఆసక్తికరంగా మారింది. మరి, ఈ కాంబినేషన్ నిజమవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ చిరు స్పిరిట్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తే, అది మెగా అభిమానులకు పెద్ద కానుక అవుతుంది. మరోవైపు, చిరు – సందీప్ రెడ్డి వంగా కాంబో ఒకేసారి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే, అది టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.