సినిమాలకు థియేటర్లు ఎంతో ముఖ్యం.. ఎన్ని ఆన్లైన్ యాప్స్ వచ్చినా.. థియేటర్ల ఆదరణ మాత్రం అస్సలు తగ్గదు. కొన్ని సంవత్సరాల నుంచి సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న చరిత్ర కలిగిన థియేటర్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ కూడా ఒకటి. అప్పట్లో.. అంటే మన తెలుగు రాష్ట్రాలలో పెద్దపెద్ద థియేటర్లు మొదలయ్యే తొలి రోజులలో.. దేశం మొత్తం మీద 70MM థియేటర్లు కొన్ని మాత్రమే ఉండేవి.
అలాంటి సమయంలో హైదరాబాదులో 1980లో సంధ్య థియేటర్ ప్రస్థానం ప్రారంభమైంది. మొదటిసారి ఆ థియేటర్లో షాలిమార్ అనే హిందీ మూవీని ప్రదర్శించారు. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం షోలే కూడా సంధ్య థియేటర్లో విడుదలయింది. అక్కడ నుంచి సంధ్యా థియేటర్ ఓ చారిత్రాత్మకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. గత పాతిక సంవత్సరాలుగా ఎన్నో స్టార్ హీరోల సినిమాలు ఈ థియేటర్లో రోజులకొద్ది ఆడాయి.
ఇప్పుడంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటున్నారు.. అప్పట్లో 50 డేస్, 100 డేస్ ,200 డేస్ ఇలా ఉండేవి సినిమాల థియారిటికల్ రన్. మల్టీప్లెక్స్ లు లేని రోజుల్లో సెలబ్రిటీలు మొదటి రోజు తమ సినిమాలను థియేటర్లో చూడాలి అంటే సంధ్యా థియేటర్కే వచ్చేవారు. ఒకప్పుడు 1500 మంది కెపాసిటీతో ఉండే సంధ్యా థియేటర్ ఆ తర్వాత కాస్త ఆధునికరణ చేయడంతో 1323 మంది సీటింగ్ కెపాసిటీకి తగ్గించబడింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎన్నో థియేటర్లు ఉన్నప్పటికీ సంధ్య థియేటర్ స్పెషాలిటీ మిగిలిన వాటికి లేదు. అప్పట్లో సంధ్యా థియేటర్లో తమ సినిమా పడాలి అని పెద్దపెద్ద హీరోలు పోటీ పడేవారు. సినిమాలు కూడా సంధ్యా థియేటర్ని మెయిన్ థియేటర్ గా భావిస్తూ విడుదల చేయడం జరిగేది. ఎన్నో సందర్భాలలో స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడు సంధ్యా థియేటర్లో ఎవరి సినిమా విడుదల అవ్వాలి అనే విషయంపై పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరిగేవి.
అయితే కార్యక్రమంలో మల్టీప్లెక్స్ లు పెరగడంతో సంధ్య థియేటర్ మనుగడ కాస్త ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆ థియేటర్ పేరును కూడా చాలామంది మర్చిపోయారు…ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప 2 మూవీ ప్రీమియం షో ఆ థియేటర్లో వేయడం.. దాన్ని చూడడానికి పుష్ప చిత్ర బృందం అక్కడికి చేరుకోవడం.. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం.. ఆమె బిడ్డ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండడం.. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం సంధ్యా థియేటర్ మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనలో సంధ్యా థియేటర్ పై చర్యలు తీసుకుంటూ పోలీసు వారు నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే ఇక సంధ్యా థియేటర్ మూతపడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఓ గొప్ప చరిత్ర కలిగిన థియేటర్ సినీ లవర్స్ కి దూరమవుతుంది.