
యువ హీరో నాగ చైతన్య, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన “తండేల్” సినిమా ప్రస్తుతం సినీ ప్రియుల్లో మంచి అంచనాలను రేపుతోంది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా నాగ చైతన్యకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఆయన గత కొన్ని సినిమాలు థియేట్రికల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. “బంగార్రాజు” తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో “దూత” అనే వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ప్రపంచంలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ హిట్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో “తండేల్” పై బజ్ పెరిగింది. మరీ ఈ హైప్ ను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టుకుంటారా అన్నది చూడాలి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దాదాపు 90 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, అక్కినేని హీరో ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయలు తీసుకున్నారని, హీరోయిన్ సాయి పల్లవి అయితే 5 కోట్లు అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వీరి కెరీర్ లోనే ఇవి అత్యధిక రెమ్యునరేషన్లు కావడం విశేషం.
సాయి పల్లవి ప్రస్తుతం వరుస విజయాల్లో ఉన్నారు. గత ఏడాది ఆమె నటించిన “అమరన్” సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది. దీంతో చాలా మంది “తండేల్” పై మరింత ఆసక్తిగా ఉన్నారు. సాయి పల్లవి ఉండటం సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో మంచి రీచ్ ఏర్పడే అవకాశం ఉంది. “గేమ్ ఛేంజర్” సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ ఏడాది తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాల్సిన చిత్రం “తండేల్” అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
సినిమా ప్రమోషన్లు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అక్కినేని అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. నాగ చైతన్య కెరీర్ లో మళ్లీ ఒక హిట్ వస్తుందా, లేదా అన్నది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచిచూడాలి.