తెల్లవారుఝామున ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ జీవితం ఒక ప్రమాదకర ఘట్టాన్ని ఎదుర్కొంది. సైఫ్ నివసించే బాంద్రాలోని ఆతని నివాసంలో దొంగ ప్రవేశించి, దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, సైఫ్ ఆ దుండగుడిని ప్రతిఘటించడంతో అతడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరానికి ఆరు కత్తిపోట్లు తగలగా, వెంటనే అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించి, సైఫ్ ప్రాణాలను కాపాడారు.
అయితే ఆసుపత్రికి సైఫ్ చేరడంలో ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా పాత్ర ఆసక్తికరంగా మారింది. రాత్రి లింకిన్ రోడ్లో డ్రైవింగ్ చేస్తుండగా, “రోకో, రోకో” అంటూ ఒక మహిళ వేగంగా వచ్చి రిక్షా ఆపమని అభ్యర్థించింది. రాణా వెంటనే ఆమె మాట విన్నాడు. మహిళతో పాటు గేటు వద్ద ఒక రక్తపుమడుగులో ఉన్న వ్యక్తి కనిపించాడు. తక్షణమే అతడిని ఆటోలో తీసుకుని ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు.
ఆ వ్యక్తి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అని ఆటో డ్రైవర్‌కు మొదట తెలియదు. అతడు రక్తంతో తడిసిన తెల్లచొక్కా ధరించి ఉండగా, అతనితో పాటు ఒక యువకుడు, ఒక చిన్న పిల్లవాడు కూడా ఆటోలో కూర్చున్నారు. రాణా మాటల ప్రకారం, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో కూడా ఆ వ్యక్తి ఎవరో తెలీకపోవడంతో భయంతో ఉన్నాడు. లీలావతికి తీసుకెళ్లమని చెప్పిన తర్వాతే అతడు సైఫ్ అని రాణాకు అర్థమైంది.
ఆసుపత్రికి చేరుకున్నాక, సైఫ్ తనను పరిచయం చేసుకున్నాడు. “నేను సైఫ్ అలీ ఖాన్” అని చెప్పినప్పుడు, రాణాకు నిజంగా ఆశ్చర్యమేసింది. ఈ ఘటన అనంతరం ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స అందించారు. సైఫ్ భార్య కరీనా కపూర్ ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్నారా? అనే ప్రశ్నకు రాణా తాను గమనించలేదని చెప్పాడు. కానీ ఘటన అనంతరం బయటకు వచ్చిన వీడియోలలో కరీనా, సైఫ్ ఇంటి పనిమనుషులతో మాట్లాడుతున్న విజువల్స్ వైరల్ అయ్యాయి.
ఈ సంఘటనలో కీలకంగా మారిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా తన పనిని ఒక సహజ బాధ్యతగా చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. సైఫ్ ప్రాణాలతో బయటపడటానికి అతని చొరవ, వేగం ముఖ్య పాత్ర పోషించాయి. ఈ ఘటన మరోసారి మానవత్వాన్ని గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో మనిషి చేసే సహాయంపై గౌరవాన్ని చూపించింది.