బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సైఫ్ ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థ రూ. 25 లక్షలు మంజూరు చేయడం పెద్ద చర్చగా మారింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్‌కు నగదు రహిత సేవలు అందించేందుకు బీమా సంస్థ తక్షణమే ఆమోదం తెలిపింది. కానీ, సాధారణ ప్రజల విషయంలో ఈ స్థాయిలో త్వరగా క్లెయిమ్ ఆమోదం జరగడం కష్టం అని పలువురు ఆరోపిస్తున్నారు.
భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ (IRDAI)కి అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ (AMC) దీనిపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తింది. సెలబ్రిటీలకు ఒక రూల్, సామాన్యులకో మరో రూల్ ఉందా? గంటల వ్యవధిలో క్లెయిమ్ ఆమోదించడమెలా సాధ్యమైందని ప్రశ్నించింది. సాధారణ ప్రజలు క్లెయిమ్ చేసేటప్పుడు ఎన్నో నిబంధనలు, ప్రామాణికాలు పాటించాల్సి వస్తుంటాయి. కానీ సెలబ్రిటీలకు సంబంధించినప్పుడు ఆ ప్రక్రియ అంత త్వరగా పూర్తవుతుండటం వ్యస్థాగత అసమానతలని చాటిచెబుతుందని బీమా నిపుణులు పేర్కొన్నారు.
బీమా నిపుణుడు నిఖిల్ ఝా ఈ విషయంపై స్పందిస్తూ సామాన్యుల క్లెయిమ్‌లు ఆమోదం పొందడానికి తగినంత సమయం పడుతుందని, అయితే డబ్బు, ప్రసిద్ధి ఉన్న వ్యక్తుల క్లెయిమ్‌లు కేవలం గంటల్లోనే ఆమోదం పొందుతున్నాయని విమర్శించారు. ఇది సామాజిక ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అసమానతల్ని బహిర్గతం చేస్తుందని చెప్పారు. మెడికోలీగల్ కేసులలో FIR కాపీ అవసరం అనేది సాధారణమైన ప్రక్రియ. కానీ, సైఫ్ అలీ ఖాన్ కేసులో ఆ ప్రక్రియను పట్టించుకోకుండా రూ. 25 లక్షలు వెంటనే మంజూరు చేశారని పేర్కొన్నారు.
సైఫ్ అలీ ఖాన్ క్లెయిమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఆన్లైన్లో లీక్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఆయన రూ. 35.95 లక్షల క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోగా, రూ. 25 లక్షలు ఇప్పటికే మంజూరు చేసినట్లు బీమా సంస్థ ధృవీకరించింది. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల క్లెయిమ్‌లు అంగీకరించడంలో ఎదురయ్యే ఆటంకాలు, ఆలస్యం ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి.
ఈ అంశం ధనిక, పేద మధ్య ఉన్న తారతమ్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత సామాన్యులకు కూడా దక్కుతుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ లభించలేదు. ఇది మన వ్యవస్థలో అసమానతల పై ఆలోచన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.