Wednesday, September 22, 2021

రాజన్న రాజ్యంలో ‘సాక్షి’ ఉద్యోగులు గగ్గోలు

రాజన్నరాజ్యం… ఇప్పుడు తొలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే మాట. దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డి కూతురు షర్మిళ తాజాగా తెలంగాణా రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘‘రాజన్న రాజ్యం ఎక్కడుంది. అందుకే’’ అంటూ తన తండ్రి హయాంలో జరిగిన పరిపాలనను మరల ప్రజలకు అందివ్వడానికి వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇదే ‘రాజన్న రాజ్యం’ అంటూ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోందని, ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లుతున్నారని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చెబుతున్నారు.

అయితే జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ‘సాక్షి’ పత్రిక ఉద్యోగులు మాత్రం రాజన్న రాజ్యంలో గగ్గోలు పెడుతున్నారు. 2009లో వైయస్సార్‌ మరణానంతరం ‘సాక్షి’ పత్రికలో పనిచేసే వారికి ఇంక్రిమెంట్‌లు ఇవ్వడం మానేశారు. జగన్‌గారు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న కారణంగా ఆయన సీఎం అయ్యే వరకూ ఓపిక పట్టాలని 2010లో ఉద్యోగులకు నచ్చజెప్పారు. దీంతో 2014 ఎన్నికల వరకూ ఉద్యోగులు సైతం ఓపిక పట్టారు. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరాజయం పాలవ్వడంతో ‘సాక్షి’ ఉద్యోగులు ఖంగు తిన్నారు. ఇక చేసేది లేక అలాగే బతుకీడ్చుకుంటూ వచ్చారు.

2019 ఎన్నికల్లో వైసీపీ ఢంకా మోగించింది. ఇక మన బతుకులు బంగారమే అనుకున్నారు ‘సాక్షి’ ఉద్యోగులు. అయితే ఈ ఆనందం ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఉద్యోగులకు మాత్రం నామమాత్రంగా జీతాలు పెంచి చేతులు దులుపుకుంది యాజమాన్యం. పై స్థాయిలో మాత్రం భారీగా జీతాలు పెంచుకున్నారు. మళ్లీ చేసేది లేక అలాగే బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కొద్ది రోజుల కిందట పిడుగులాంటి మెసేజ్‌ ఒకటి వచ్చింది.

‘‘మీకు 2 నెల జీతం అడ్వాన్స్‌గా ఇస్తాం.. రిజైన్‌ చేసి వెళ్లిపోండి’’ ఇదీ ఆ మెసేజ్‌ సారాంశం. ఇప్పటికే పెద్ద జీతాలు తీసుకుంటున్న సీనియర్‌ సబ్‌ ఎడిటర‌ు, డెస్క్‌ ఇన్‌చార్జ్‌లను వీలైనంత ఒదిలించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన వారికి ఈ రెండు నెలలు ఆఫర్‌ అంట. దీంతో రాజన్న రాజ్యం అంటే ఉన్న ఉద్యోగాలు పీకేయడమన్నమాట అని ఉద్యోగులు కన్నీరు పెడుతున్నారు. గతంలో ‘ఈనాడు’ పత్రిక కూడా ఇలానే ఉద్యోగులను ఇంటికి సాగనంపితే ‘సాక్షి’ రామోజీపైన, ‘ఈనాడు’పైనా నిప్పులు చెరిగింది. ఇప్పుడు తానే ఆ పని చేస్తోంది. కొసమెరుపేమిటంటే.. ఈనాడు తన ఉద్యోగులకు 4 నెల జీతాలను ముందుగా ఇస్తే సాక్షి మాత్రం 2 నెలలతో సరిపెట్టుకొమ్మంటోంది.

Latest Articles