
ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాగచైతన్యతో సమంతకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.
సమంత కెరీర్ విషయానికి వస్తే, ఆమె టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. సమంతకు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
అయితే, ఇటీవల సమంత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. శకుంతలం, యశోద వంటి సినిమాలు చేసినా, అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా వచ్చిన సిటాడెల్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దీంతో సమంతతో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో చాలా మంది నిర్మాతలు ఉన్నారు. టాలీవుడ్లో కూడా ఆమె కమ్‌బ్యాక్ కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అవకాశాలు అన్నీ రష్మికా మందన్నాకు వస్తున్నాయి. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది. యానిమల్, పుష్ప 2, చావా సినిమాల తర్వాత ఆమెకు భారీ డిమాండ్ పెరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్గా అడుగు పెట్టిన రష్మిక, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన రష్మిక, మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. స్టార్డమ్ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం సాధారణమే. ఇప్పుడు రష్మిక కూడా అదే దారిలో అడుగేస్తూ, కథా బలం ఉన్న ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటోంది.
ఏదేమైనా, సమంత ప్రస్తుతం యాక్టివ్‌గా లేకపోవడం రష్మికకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కెరీర్లో ఇలాంటి మలుపులు రావడం అభిమానులకు నిరాశ కలిగించవచ్చు, కానీ సినీ పరిశ్రమలో మార్పులు సహజమే. రష్మిక ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో ఆమె కెరీర్ మరింత బలపడే అవకాశాలున్నాయి.