
సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పిందా? తిరిగి వెండితెరకు రానుందా? అనే ప్రశ్నలు కొన్నాళ్లుగా ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే, ఆమె కొత్త ప్రాజెక్టులు ప్రకటించినా, షూటింగ్ మాత్రం మొదలయ్యేలా కనిపించలేదు. పైగా, గతంలో కొన్ని ఇంటర్వ్యూలో “ఇకపై నా చివరి సినిమా అనిపించే చిత్రాలనే చేస్తాను” అని చెప్పడం మరింత అనుమానాలు రేకెత్తించింది.
కానీ ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ, సమంత తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ చిన్న సంకేతం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ, ఓ అభిమాని “సమంత బ్రో, మీరు తిరిగి రావాలి. మిమ్మల్ని ఆపే వాళ్లే లేరు” అని వ్యాఖ్యానించగా, దీనిపై సమంత “తిరిగి వస్తున్నాను బ్రో” అంటూ సింపుల్ గా, కానీ స్పష్టంగా స్పందించింది. ఈ మాటలు ఆమెను వెండితెరపై మళ్లీ చూడాలనుకునే అభిమానులకు ఊరటనిచ్చాయి.
ఇక సినిమాలే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సమంత తన జీవితంలో కొత్తగా నేర్చుకున్న విషయాన్ని పంచుకుంది. “మూడు రోజుల పాటు మౌన వ్రతం పాటించాను. అయితే రెండో రోజుకు ఫోన్ లేకుండా ఉండలేకపోయాను. కానీ చివరికి మౌనంగా ఉండటం వల్ల నాతోనే మాట్లాడుకునే అవకాశమొచ్చింది. అది నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది” అంటూ తన అనుభవాన్ని చెప్పింది.
ఇక సమంత వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ఊపందుకున్నాయి. దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె ప్రత్యేకమైన బంధం కొనసాగిస్తోందని, వీళ్లిద్దరూ కలిసి ఓ టోర్నమెంట్‌కు హాజరయ్యారని ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది. పైగా, త్వరలోనే ఈ బంధాన్ని ఆమె అధికారికంగా ప్రకటించనున్నట్టు కొన్ని వర్గాలు అంటున్నాయి.
అయితే, ఈ విషయాలన్నీ ఎప్పుడు క్లారిటీకి వస్తాయో తెలియదు కానీ, సమంత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే ఉద్దేశ్యం లేదని మాత్రం ఆమె రీసెంట్ గా ఇచ్చిన సమాధానంతో అర్థమైంది. మరి ఆమె తదుపరి చిత్రం ఏమిటో, ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.