సౌత్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయి తెచ్చిన దర్శకుడు శంకర్ గురించి ఇటీవల అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు శంకర్ సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లోనూ విపరీతమైన పేరు పొందాయి. కానీ ఇటీవల కాలంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఆడియన్స్ లో నిరాశ వ్యాప్తి చెందింది. ముఖ్యంగా రోబో సినిమా తరువాత శంకర్ తీసిన ఏ చిత్రమూ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు.
రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా శంకర్ తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన “గేమ్ ఛేంజర్” కూడా భారీ అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు దశాబ్దంగా శంకర్ సినిమాల్లోని మ్యాజిక్ కనిపించకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం సుజాత రంగరాజన్ అనే రచయిత అని అనుకుంటున్నారు. సుజాత శంకర్ సినిమాలకు కీలకంగా పనిచేసిన వ్యక్తి.
శంకర్ కెరీర్ ప్రారంభంలోనే ఆయన చిత్రాలకు కథ, డైలాగులు అందించిన సుజాత, శంకర్ టీమ్ లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ముఖ్యంగా రోబో లాంటి విజయం సాధించిన సినిమాకు సుజాత కీలకమైన సహకారం అందించారు. కానీ 2008లో సుజాత మరణం చెందడంతో ఆ తరువాత శంకర్ సినిమాల్లో ఆ మ్యాజిక్ కనిపించడం మానేసింది. రోబో షూటింగ్ సమయంలోనే సుజాత మరణించినప్పటికీ, అప్పటికే ఆయన పనిని పూర్తి చేశారు. రోబో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత వచ్చిన శంకర్ చిత్రాలు సుజాత మాదిరి రచనతో అలరించలేకపోయాయి. “భారతీయుడు” లాంటి బ్లాక్ బస్టర్ సుజాత సహకారంతో రూపొందింది. కానీ “భారతీయుడు 2” వంటి సీక్వెల్ డిజాస్టర్ అవ్వడంతో సుజాత లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆయన దిశానిర్దేశం లేకపోవడం వల్ల కథల ఎంపిక, కథనం విషయంలో శంకర్ తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ముందు ముందు శంకర్ తన కథలపై మరింత శ్రద్ధ పెట్టి, సుజాత తరహాలో కథనాన్ని మలచేందుకు నిపుణులను తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం “భారతీయుడు 3″ను ప్లాన్ చేస్తున్న శంకర్ ఈ విషయంలో జాగ్రత్త వహిస్తారనే ఆశలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.