నీళ్లున్నంత వరకే నూతిలో అయినా.. చెరువులో అయినా.. అవి ఎండిపోయే పరిస్థితి వస్తోందనే అనుమానం వచ్చిందా.. అవి కాస్తా సేఫ్ జోన్‌ను వెతుక్కుంటాయి.
రాజకీయ నాయకులు కూడా అంతే అప్పటి వరకూ అధికారం వెలగబెట్టిన పార్టీనే తీవ్రంగా విమర్శించటానికి కూడా వెనకాడరు. నిన్నటి వరకూ అధికారంలో ఉన్నది మనమే..
మనం కాలేదు అంటున్న పనులు చేయాల్సిన పవర్ మన చేతుల్లోనే కదా ఉంది అనే ఆలోచన కూడా వారికి ఉండదు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది అనేది చూచాయిగా అర్ధమౌతోంది.
ఇటీవల కాలంలో ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలకు రావడం నిజంగా సంచలనమే. నేనే 30 ఏళ్లు ముఖ్యమంత్రి అన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఇది ఊహించని పరిణామమే.
అయినా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే రకం తత్వం జగన్‌ది. ఎవరెన్ని చెప్పినా ఆయనకు నచ్చిందే జరగాలి.
ఈ మనస్తత్వం కారణంగానే 151 సీట్ల అద్భుతమైన మెజార్టీని పొందినప్పటికీ 5 సంవత్సరాలు తిరిగేసరికి అంతా అగమ్యగోచరంగా ఉంది.
ఆ పార్టీ నుంచి అనేకమంది నాయకులు బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలలో జేరడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ రిజర్వ్‌డ్) నియోజకవర్గ ఎమ్మెల్యే,
జగనన్నకు ఇష్టమైన చెల్లెలు జొన్నలగడ్డ పద్మావతి కూడా తమ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా తాను తెచ్చుకోలేని పరిస్థితి ఉందని,
ఎస్సీ మహిళనైన నా నియోజకవర్గంను అభివృద్ధికి నోచుకోకుండా చేయడం భరించలేక పోతున్నానని, ఇలా ఎందుకు జరుగుతోందో నాకు ఒక క్వశ్చన్‌మార్క్‌గా ఉండి పోయింది.
ఎవరికో నేనే అణిగి, మణిగా ఉండాలి. ఎవరి ఇగోనో సంతృప్తి పరచటానికి నన్ను ఇబ్బంది పెడతారా. నా నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని నేను బయటకు చెప్ప కూడదట.
చెపితే చాలా పెద్ద తప్పట. ఇది న్యాయమేనా? ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగ పరచుకోవాలి అనుకున్నా.
ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొసమెరుపుమేమిటంటే…
జొన్నలగడ్డ పద్మావతి గారి భర్త ఆలూరు సాంబశివారెడ్డి. ఈయన వ్యాపారవేత్త. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యకు సంబంధించి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. నాడు`నేడు పనుల విషయంలో ఈయన రాష్ట్రవ్యాప్తంగా చక్రం తిప్పినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి.