సోషల్ మీడియాలో సింగర్ ”చిన్మయి” పై నెటిజన్ల వ్యతిరేకత ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఆమె ఏ ట్వీట్ చేసినా, చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. చిన్మయిని ‘ఫెమినిస్ట్’ అని ముద్రవేసి, ఆమె చేసే వ్యాఖ్యలు మహిళల కోణంలో పోతాయని ఆరోపిస్తుంటారు. కానీ, ఆమె తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తూ వస్తోంది. కొన్ని విషయాలు ఆమె మాట్లాడే మాటలు చాలా నిక్కచ్చిగా ఉండడంతో ఆమెకు కాస్త వ్యతిరేకత ఎదురవుతుంది.
”భారతదేశంలో మహిళల భద్రత” గురించి చిన్మయి తరచుగా పోస్ట్ చేస్తుంటారు. ఆమె దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎత్తిచూపుతూ, సమాజానికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ”మీటూ ఉద్యమం” సమయంలో, చిన్మయి ప్రముఖ కవి వైరముత్తుపై ఆరోపణలు చేశారు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత, చిన్మయిపై పరిశ్రమ నుంచి అనేక ఆంక్షలు విధించారు. ఆమెకు పాటలు పాడేందుకు, డబ్బింగ్ అవకాశాలు ఇవ్వడం ఆపేశారు. కానీ, ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ఆమె తన పోరాటాన్ని ఆపలేదు.
ఇటీవల, కొంతమంది నిర్మాతలు చిన్మయిని తిరిగి ఆహ్వానిస్తూ, పాటలు పాడేందుకు అవకాశాలు ఇస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆమెకి వ్యతిరేకంగా ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై చిన్మయి ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఆ నెటిజన్ బ్లింకిట్ యాప్ ద్వారా ఒక్కరోజులో లక్ష కండోమ్‌లు అమ్ముడయ్యాయంటూ, ‘ఇక వర్జిన్ అమ్మాయిని భార్యగా ఆశించడం వదిలేయాలి’ అన్న ట్వీట్ చేశాడు.
దీనికి చిన్మయి ఘాటుగా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆమె, ‘మహిళలతో శృంగారం చేసేది పురుషులే. మళ్లీ అదే పురుషులు వర్జిన్ మహిళలను భార్యగా కోరుతున్నారు. మీకు నిజంగా ఇంత కోరిక ఉంటే, మీ సోదరులు, మగ స్నేహితులు పెళ్లి వరకు శృంగారం చేయొద్దని చెప్పండి’ అని ఘాటుగా స్పందించారు.
ప్రతీ విషయంలో తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పడం, మహిళల హక్కుల కోసం నిలబడటం ఆమెలోని ప్రత్యేకత . కోలీవుడ్‌లో నిషేధం ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఎప్పటికీ వెనక్కు తగ్గలేదు. విభిన్న సమస్యలపై స్పందిస్తూ, మహిళల మనోభావాలకు మద్దతుగా నిలబడటమే ఆమె లక్ష్యమని చెప్పవచ్చు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపే చిన్మయి, ట్రోలింగ్ ఎదురైనా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.