టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాలీవుడ్ చిత్రం ‘2018’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2018లో కేరళను అతలాకుతలం చేసిన వరదలను ఆధారంగా తీసుకుని, జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కేవలం 26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. ప్రత్యేకంగా తెలుగులో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
ఈ విజయానికి ప్రేరణగా, కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ తన 25వ చిత్రాన్ని ఇదే తరహాలో రూపొందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ‘అమరన్’ తో మంచి హిట్ అందుకున్న శివకార్తికేయన్, ఈ కొత్త సినిమాను ప్రముఖ దర్శకురాలు సుధ కొంగరతో చేయనున్నట్లు ప్రకటించారు. సుధ కొంగర, ‘గురు’ మరియు ‘ఆకాశం నీ హద్దురా’ వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు, మరోసారి ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘1965’ పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమా కథ ఏమిటో అనే విశ్వంపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొని ఉంది . సినిమా టైటిల్ ‘1965’ అని ఖరారు చేయడం వల్ల కథకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 1965లో కేరళలో ఎలాంటి విపత్తు చోటుచేసుకుందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘2018’ చిత్రం కేరళ వరదల ఆధారంగా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఈ చిత్రం కూడా అలాంటి గొప్ప ఘటనను ఆధారంగా తీసుకుని ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో శివకార్తికేయన్ ఇంతకుముందు ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయం రవి, అధర్వ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించడంతో, ఈ చిత్రానికి మరింత బజ్ క్రియేట్ అవుతోంది. సుధ కొంగర, వాస్తవ సంఘటనలను వెండితెరపై చక్కగా ఆవిష్కరించడంలో ప్రావీణ్యం పొందిన దర్శకురాలు కాబట్టి, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం, శివకార్తికేయన్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రం, ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉంటుందని అంచనా. ఇక ఈ మూవీ అమరన్ సక్సెస్ తో తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చిత్ర బృందం ఆశిస్తున్నట్టు టాక్.