
డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నించాడంటూ లావణ్య..బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె పోలీసులకు అందజేసిన ఆడియో ఆధారాలతో శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల్లో మరో కేసు కూడా నమోదైంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కూడా శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. గతంలో జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన ఆమె, ఇప్పుడు శేఖర్ బాషా విషయంలోనూ పోలీసులను ఆశ్రయించింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా, తన వ్యక్తిగత కాల్ రికార్డులు లీక్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనివల్ల తన పరువుకు భంగం కలుగుతోందని, యూట్యూబ్ ఛానెల్స్ లోనూ తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల విచారణలో ఉద్దేశపూర్వకంగానే కాల్ రికార్డులను లీక్ చేసినట్టు తేలింది. దీంతో శేఖర్ బాషాపై BNS యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు. అదనంగా, అతని వ్యక్తిగత మొబైల్ సహా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేయాలని బాధితురాలు కోరింది.
మరోవైపు మస్తాన్ సాయి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అతని హార్డ్ డిస్క్‌ను పరిశీలించగా, కొన్ని కీలకమైన వీడియోలు దొరికాయి. పోలీసుల అనుమానం నిజమయ్యేలా, మస్తాన్ సాయి అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా, మత్తులో వారిపై లైంగిక దాడులు కూడా చేశాడని గుర్తించారు. ఈ కేసులో అతని సహచరుడు ఖాజా కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉప్పరపల్లి కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. వారం రోజుల పాటు మస్తాన్ సాయి, ఖాజాలను కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతి కోరారు. అంతకు ముందు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో మస్తాన్ సాయి కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతని మొబైల్‌ను కూడా సీజ్ చేసి, డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడన్న అంశంపై ఆరా తీస్తున్నారు.
ఈ రెండు కేసులు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి సంచలనంగా మారాయి. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై వచ్చిన ఆరోపణలు, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసు ఇద్దరినీ చిక్కుల్లోకి నెట్టాయి. పోలీసులు ఇప్పుడు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.