పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నాడు. RC 17 వర్కింగ్ టైటిల్ ఈ సినిమా ప్లానింగ్‌పై సుకుమార్ పూర్తి ఫోకస్ పెట్టాడు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలోపే సుకుమార్ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటికే రంగస్థలం వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చి అందరినీ అలరించింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ఏ రకమైన కథతో వస్తుందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
సుకుమార్ తన సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కనీసం 3 ఏళ్లు సుకుమార్ కేటాయిస్తాడని అంచనా. తదుపరి ప్రాజెక్ట్ కోసం కూడా సుమారు 2-3 ఏళ్లు ఖర్చు చేయవచ్చు. గతంలో సుకుమార్ రెండేళ్లకు ఓ సినిమా చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ మూడు సంవత్సరాలకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 10 ఏళ్లలో సుకుమార్ కేవలం మూడు సినిమాలు మాత్రమే చేయగలడేమోనని భావిస్తున్నారు. రామ్ చరణ్ తర్వాత సుకుమార్ హీరోల లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, మహేష్ బాబులు ఉన్నారని సమాచారం. అంతేకాదు, పుష్ప 2 చివర్లో పుష్ప 3 వస్తుందని సుకుమార్ ఇచ్చిన క్లూ అభిమానులను ఆశ్చర్యపరిచింది. పుష్ప 3కి కనీసం మరో రెండు సంవత్సరాలు కేటాయించాల్సి వస్తుంది.
సుకుమార్ తన పనితీరులో నిదానంగా వ్యవహరించినా, సినిమాలు విడుదలైన తర్వాత పక్కా హిట్ సాధించడం అనేది గ్యారంటీ. అందుకే అభిమానులు అతడి సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. రాబోయే రోజుల్లో సుకుమార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి హీరోలతో ఎలా సినిమాలు చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది . ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కూడా సుకుమార్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ ప్రాజెక్టు ఎప్పుడు కుదురుతుందన్నది తెలియడం లేదు. సుకుమార్ మార్క్ సినిమాలు సాధారణంగా లేట్ అయినా, ప్రేక్షకులకు ఫీస్ట్ లాంటివి అవుతాయి. దీంతో సుకుమార్ నుంచి భవిష్యత్తులో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్బస్టర్లుగా నిలుస్తాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.