నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సందర్భంగా సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు, ఆయన అల్లు అర్జున్ను ఉద్దేశించారనే వాదనకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో, యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోను ఉపయోగించి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను ట్రోల్ చేయడం జరిగింది. అయితే సురేష్ బాబు తాజాగా మరో ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
“బన్నీ నా కొడుకు ఫ్రెండ్. నేను అతనిని చిన్నప్పటి నుంచే తెలుసు. అలాంటి వ్యక్తిని ఎందుకు అనాలి?” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను బన్నీని ఉద్దేశించి ఏం చెప్పలేదని, తన మాటల ఉద్దేశ్యం పబ్లిక్ ప్రవర్తనపై అవగాహన కల్పించడమేనని వివరించారు.
ఇక తొక్కిసలాట ఘటనలపై మాట్లాడిన సురేష్ బాబు, “ఈవెంట్స్ నిర్వహణలో జాగ్రత్తలు అవసరం. జనాలు ఎక్కువగా వచ్చే వేళ, పోలీసుల నుంచి లొకల్ సెక్యూరిటీ వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. జనాల్లో పబ్లిక్ ప్రవర్తన పట్ల అవగాహన పెంచడం అవసరం,” అని అన్నారు.
తన జపాన్ పర్యటన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “అక్కడ ప్రజలు పబ్లిక్ ప్రాపర్టీని ఎంత గౌరవిస్తారో చూశాను. మనం కూడా అలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి. ట్రైన్లో, సినిమా థియేటర్లో మర్యాదగా ఉండటం నేర్చుకోవాలి,” అన్నారు.
అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ, “పుష్ప చిత్రం హిందీ మార్కెట్లో పెద్ద విజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ సినిమా హిందీలో నెం.1గా నిలవడం అరుదైన విషయం. అల్లు అర్జున్ తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇది నిజమైన టాలెంట్ గుర్తింపుకు నిదర్శనం,” అన్నారు.
సురేష్ బాబు తన వ్యాఖ్యలు పూర్తిగా పాజిటివ్ ఉద్దేశంతో చేసినప్పటికీ, కొన్ని మీడియా వర్గాలు వాటిని వక్రీకరించారని అన్నారు. “మన జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలన్నదే మనం ప్రతిరోజూ ఆలోచించాలి. పాజిటివ్‌గా మాట్లాడుకుంటూ ముందుకు సాగాలి,” అని తెలిపారు.
ఈ సంఘటనల నేపథ్యంలో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సురేష్ బాబు చేసిన స్పష్టీకరణను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, యాంటీ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి, సురేష్ బాబు తన వ్యాఖ్యల స్పష్టీకరణతో పాజిటివ్ నోట్లో చర్చను ముగించారు.