
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు గత మూడేళ్లుగా హిట్ లు లేకపోవడంతో ఈసారి ఎలాగైనా విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతో క్రేజీ డైరెక్టర్ చందూ మొండేటీతో కలిసి తండేల్ సినిమాను చేశారు. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకూడా మంచి వసూళ్లను అందుకుంది.
ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన నిజమైన కథ ఆధారంగా తెరకెక్కింది. సముద్రం, పాకిస్థాన్ నేపథ్యంలో ఈ కథ నడవడంతో సెట్స్, రీసెర్చ్ పనులు భారీగా చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో టెక్నికల్ టీమ్, టాలెంటెడ్ యాక్టర్లు పని చేయడంతో ఖర్చులు కూడా పెరిగాయి. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.75 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.
సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.16 కోట్లు, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.11 కోట్లకు అమ్ముడయ్యాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.27 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా 28 కోట్ల షేర్, దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది.
ఇక ఇతర ప్రాంతాల్లో కూడా మంచి బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ రూ.10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.12 కోట్ల మేర అమ్ముడయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.52 కోట్ల మేర బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.105 కోట్ల గ్రాస్, రూ.54 కోట్ల షేర్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు 1500 స్క్రీన్లలో ప్రదర్శన కల్పించారు.
రెండో రోజు వసూళ్ల పరంగా చూస్తే తండేల్ మంచి హోల్డ్ సాధించింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ నటించిన పట్టుదల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ యూత్ ఆడియన్స్ నుండి తండేల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం బుకింగ్స్ బాగుండటంతో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల వసూళ్లతో మొత్తం రూ.14 కోట్లు రాబట్టింది. నాగచైతన్య పర్ఫార్మెన్స్, కథనంపై వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు లాభించింది. ఆదివారం ఉదయం వరకు ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.