ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సంబరం మొదలైంది. రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాయి.
ఈసారి ఎన్నికలలో సీఎం జగన్ ఎప్పటిలాగానే ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ మరియు జనసేన మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి. సీఎం జగన్ ని ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసాయి అనేది అందరికీ తెలిసిందే.
ఇన్ని రోజులు అంతర్గత మీటింగ్స్ మరియు వ్యూహరచనలతో బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు, జనవరి 5 వ తారీఖు నుండి ‘రా కదలిరా’ అనే పేరుతో ఎన్నికల రణభేరి కి శంఖారావం పూరించబోతున్నారు.
జనవరి 5 వ తారీఖు నుండి వరుసగా ఈ ఒక్క నెలలో 22 టీడీపీ – జనసేన ఉమ్మడి సభలు జరగబోతున్నాయి. ఈ నెల 5 వ తారీఖున ఒంగోలు లో మొట్టమొదటి బహిరంగ సభ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.
ఈ సభకు చంద్రబాబు తో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నాడు. అనంతరం విజయవాడ లో 6 వ తేదీన పార్లమెంట్ పరిధిలో మరో భారీ బహిరంగ సభ జరగబోతుంది.
ఆ తర్వాత 9 వ తేదీన తిరుపతి లో, 10 వ తేదీన విజయ నగరం లో భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి. ఈ నెల మొత్తం ఈ ఇరువురి పార్టీల అధినేతలు ఈ విధంగా జనాల్లోకి వెళ్ళబోతున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ ఈ నెల 7 వ తారీఖు నుండి మూడు రోజుల పాటు భీమవరం లో జనసేన కార్యకర్తలతో ముఖ్యమైన మీటింగ్స్ ని ఏర్పాటు చెయ్యబోతున్నారు.
వచ్చే ఎన్నికలలో ఆయన ఈ స్థానం నుండే పోటీ చేయబోతున్నాడని టాక్. అంతే కాకుండా రెండవ స్థానం కాకినాడ సిటీ నుండి కానీ, లేకపోతే విజయవాడ వెస్ట్ నుండి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే భారీ ఆర్భాటం తో ప్రారంభమై రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టించిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పటి నుండి మొదలు కాబోతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
జనసేన పార్టీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభ్యర్థుల జాబితా ఖరారు అయ్యాకనే వారాహి మళ్ళీ కదులుతుందని అంటున్నారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థుల జాబితా బయటకి వచ్చే అవకాశం ఉంది.