Wednesday, September 22, 2021

మేం సీనియర్ యాంకర్‌లం కాదా? ఏమిటట ఆమె గొప్ప

జీవితంలో స్థిరపడడానికి ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో తమ ప్రతిభను ఆధారం చేసుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. అదృష్టం తోడైతే అందలాలు ఎక్కుతారు. లేకపోతే అనామకులుగా మిగిలిపోతారు. రెండవ బ్యాచ్ ఇక మనకెందుకులే అని తట్టాబుట్టా సర్ధుకుని తిరుగుముఖం పడతారు. కానీ మొదటి రకం మాత్రం అదోరకం.. విజయం తలుపు తట్టే వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

అదృష్టం.. టాలెంట్ ఉన్నా కొందరి వైఖరి వల్ల ఎప్పటికీ ఎదురు చూపుల్తోనే కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇంకా ఓర్పు నిశిస్తే మాత్రం తిక్కరేగి ఉన్నతాధికారుల దుమ్ము దులుపుతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఓ ఛానల్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తెలుగులో అదో ప్రముఖ న్యూస్ ఛానల్. ఉన్నదానికీ.. లేని దానికీ బ్రేకింగ్‌ల సంస్కృతి వారి నైజం. అందులో ఓ ముదురు యాంకరమ్మదే పెత్తనం. న్యూస్ రీడింగ్ అయినా.. యాంకరింగ్ అయినా.. వాయిస్ ఓవర్ అయినా ముందు ఆమే ఆప్షన్. ఆ తర్వాతే ఎవరైనా. ఏ ప్రోగ్రావ్‌ు మొదలెట్టినా ఆమె ముద్ర ఉండాల్సిందేనట. అదే ఛానల్‌లో ఈవిడకు మించిన టాలెంట్ ఉన్న వారు ఉన్నప్పటికీ ఈమే స్పెషల్‌గా మారిపోయింది. దీనివల్ల అంతర్గతంగా అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. అయినా ఆమెదే పై చేయి. ఇటీవల ఓ కార్యక్రమానికి సంబంధించి యాంకరింగ్ బాధ్యతలు ఓ న్యూస్ రీడర్‌కు అప్పగించారట. ఆమె అంతా ప్రిపేర్ అయి ఫ్లోర్‌లోకి అడుగుపెట్టగానే అప్పటికే ఆ ముదురు యాంకర్ పని మొదలెట్టేసింది.

చిర్రెత్తుకొచ్చిన ఈమె నేరుగా తన పై అఫీసర్ ఛాంబర్‌కు వెళ్లి ఇదేమిటి అని ప్రశ్నించగా.. ఈరోజు ఆమె రావడంలేదు అని తెలిసింది. అందుకే మీకు అప్పగించాం. తీరా చూస్తే ఆమె ప్రత్యక్షం అయింది.. అంటూ నీళ్లు నమిలాడట ఆ అధికారి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సదరు యాంకరమ్మ ‘‘ఏం మేం యాంకర్‌లం కాదా? ఏమిటట ఆమె గొప్ప. అన్నింటికీ ఆమె అన్న ధోరణిలో మీరు ఉంటే.. రోజూ మేం ఆఫీస్‌కు రావడం ఎందుకు? ఆవిడ సెలవు పెట్టిన రోజు మాత్రమే పిలవండి చాలు’’ అంటూ రుసరుసా వెళ్ళిపోయిందట.

ఈ విషయమై మిగిలిన యాకంర్‌లు కూడా ఆమెకు సపోర్ట్‌గా స్వరాలు పెంచడం మొదలు పెడతారేమోననే భయంతో అప్పటికప్పుడు యాజమాన్యం దూతలు ఆమె ఇంటికి పరుగులు పెట్టి మొత్తబరిచారట.
మల్టీటాలెంట్ ఉన్నా ఒక్కోసారి అతి ప్రోత్సాహం మనస్పర్ధలకు దారి తీస్తుంది. తద్వారా మిగిలిన ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాదు.. అభద్రతా భావం కూడా కలుగుతుందని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.

Latest Articles