Saturday, July 24, 2021

పెద్దారెడ్డి వైసీపీ కొంప ముంచేలా ఉన్నాడే

ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నెలవు రాయసీమ. ఒక్క రాయసీమలోనే రాజకీయ కక్షలు, హత్యలు, దాడులు ఉంటాయనుకుంటే పొరపాటే. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. అయితే బి. గోపాల్‌ పుణ్యమా అని రాయసీమలోని ఫ్యాక్షన్‌ జనాలకు బాగా చేరువైంది. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు సీమలోని వేలాది కుటుంబాలు బలయ్యాయి అనేది జగమెరిగిన సత్యం. నాయకుల వ్యక్తిగత, కుటుంబ కక్షలకు అమాయకులు కత్తులు పట్టుకుని కుత్తుకలు తెంపుకునేవారు. 2000 సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి ఈ కక్షలు కొంత తగ్గుముఖం పట్టాయి. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి మరింత తగ్గుముఖం పట్టాయి. గత దశాబ్ద కాలంగా చెదురు మదురు సంఘటనలు మినహా సీమ ప్రశాంతంగానే ఉంది.

తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన చిరకాల ప్రత్యర్థి అయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి నట్టింట్లోకే మందీ మార్భంతో వెళ్లి హల్‌చల్‌ సృష్టించడం సంచలనం కలిగించింది. అప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేకపోవడం సీమ నెత్తిన పాలు పోసినట్లు అయింది. విషయం తెలు సుకున్న జేసీ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఈ సంఘటన అనేక రాజకీయ మ లుపులకు దారి తీసి సవాళ్లు, ప్రతి సవాళ్లకు కారణమైంది. తన ఇంటిపై దాడి విషయమై జేసీ పోలీసు లకు ఫిర్యాదు చేయక పోవడంతో ఏ క్షణాన సీమ ఫ్యాక్షన్‌ మళ్లీ పడగ విప్పుతుందోనని ఆ ప్రాంత వాసులు భయంతో బ్రతుకుతున్నారు.

అదృష్టం కొద్దీ పరిస్థితు కొంత చల్లబడుతున్నతరుణంలో పెద్దారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కక్షల రక్కసిని మరోమారు నిద్రలేపుతున్నాట్లుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ క్లాస్‌ పీకినప్పటకీ పెద్దారెడ్డి మళ్లీ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి ‘‘ఈసారి నువ్వు నీ కుటుంబంతో రా… నేను నా కుటుంబంతో వస్తా. ఎవ్వరో ఒక్కరి కుటుంబమే మిగలాలి’’ అంటూ తాజాగా సవాల్‌ విసిరారు. దీంతో వైసీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. చల్లారిపోయింది అనుకున్న ఫ్యాక్షన్‌ రక్కసిని పెద్దారెడ్డి పదే పదే లేపడానికి ప్రయత్నిస్తుండడం ఆ పార్టీ కొంప ముంచేలా ఉంది. సీమ ప్రాంతంలో మరోసారి ఆ భూతం జూలు విదిలిస్తే ఆపడం ఎవ్వరి తరం కాదన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా కేతిరెడ్డి లాంటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తులను జగన్‌ నిలువరిస్తే కొన్ని అమాయక ప్రాణాలను కాపాడిన వారవుతారు.

Related Articles

Latest Articles