టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించిన ఆయన, ప్రస్తుతం యూట్యూబ్‌లో తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు. ఇండస్ట్రీలో ఏదైనా వివాదం వస్తే, దాని మీద తన అభిప్రాయాలను స్పష్టంగా, నిక్కచ్చిగా పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిన దుర్ఘటన. డిసెంబర్ 4న జరిగిన ఈ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్‌కు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదానికి కారణం అల్లు అర్జున్ థియేటర్కు రావడమే అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు థియేటర్ యాజమాన్యం తోపాటు బన్నీపై కేసు నమోదు చేశారు.
పోలీసుల అనుమతి లేకుండా థియేటర్‌కి వెళ్లడం అల్లు అర్జున్ చేసిన మొదటి తప్పు. పైగా మహిళ మరణించిన విషయం తెలిసినప్పటికీ, ఏం జరగనట్లు సినిమా చూసి, ఆ తర్వాత క్యాజువల్‌గా బయటకు రావడం రెండో తప్పు. ఈ రెండు తప్పులు బన్నీపై తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇప్పటికే పోలీసులు బన్నీని రెండు సార్లు విచారించారు, కానీ ఇంకా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఒక పబ్లిక్ ఫిగర్ గా బన్నీ ఇలా ప్రవర్తించడం సబబు కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ దుర్ఘటనపై తమ్మారెడ్డి తనదైన శైలిలో అభిప్రాయాలను చెప్పాడు. “ఒకరి ఈగో కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఈగో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది. ఒక వ్యక్తి చేసిన తప్పు కారణంగా మొత్తం ఇండస్ట్రీ తలవంచుకోవాల్సి వచ్చింది,” అని వ్యాఖ్యానించారు.
తమ్మారెడ్డి మాటల ప్రకారం, అల్లు అర్జున్ తన చర్యలతో బాధ్యత వహించాల్సి ఉన్నా, అవి మరింత సమస్యలకే దారితీశాయి. పైగా, ఈ ఘటన కారణంగా ప్రభుత్వం బెనిఫిట్ షోలపై ఆంక్షలు విధించింది. ఇది ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ్మారెడ్డి చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కానీ ఈ ఘటన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట చాలామంది సినీ పెద్దలు అల్లు అర్జున్ కు అండగా నిలబడినప్పటికీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి.