రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగా అన్ని చోట్లా ఉంటుంది. కానీ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చూసుకోవాలి.
టీడీపీ, జనసేన కలవడం అనేది వారికి పెచ్చింగ్ అంశమే. ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్‌లో జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. జగన్ చేసిన ప్రయోగం ఏమిటంటే..
ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, మనకు వచ్చిన డబ్బులన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి పంచిపెట్టేయడం అనేది ఒక కొత్త ఐడియా.
ఈ పంచిపెట్టడాలు ఇందిరా గాంధీ టైమ్‌లో మొదలైంది. కాకపోతే ఆవిడ పేదలకు ఇళ్ల స్థలాలు, దున్నుకోవటానికి భూములు వంటివి ఇచ్చారు.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రూపాయికే కిలో బియ్యం అంటూ మొదలు పెట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్లు రుణమాఫీ అన్నారు. మెల్ల మెల్లగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం వీళ్లకు పంచిపెట్టేస్తే ఓట్లు వేసేస్తారు అని ఫిక్స్ అయ్యారు.
ఇక్కడ ఓటర్లు ఆలోచించాల్సింది ఎందుకు వీళ్లు ఇంత తాపత్రయ పడుతున్నారు. ఏ రైతు కూడా తన కొడుకు తనకన్నా గొప్ప రైతు కావాలని కోరుకోవట్లేదు. ఏ లారీ, ఆటో డ్రైవర్ తన కొడుకు తనకన్నా గొప్ప డ్రైవర్ కావాలని కోరుకోవడంలా.
డాక్టర్ కొడుకు డాక్టర్ అవడానికి, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది.
జర్నలిస్ట్‌లు కూడా జర్నలిస్ట్‌లు కావాలని కోరుకోవడంలా. జనానికి రెండువేలు ఇచ్చి ఓట్లు వేయించుకుని వాళ్లు ఓట్లు, కోట్లు సంపాదించుకుంటున్నారు.
నిజాయితీ అనేది పేదవారికి ఉన్న శాపం. అందరి దగ్గరా డబ్బులు తీసుకున్నా.. ఒక్కరికే వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు నాయకుల ఇళ్లముందు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది.
పూర్వం బాణాలు, కత్తులతో పోరాటం చేసి రాజ్యాలు దక్కించుకునే వారు. ఇప్పుడు ఓటుతో అలా రాజ్యాధికారం సాధించి రాజ్యం బొక్కసాల్లోని సొమ్ములు తినేస్తున్నారు అంతే అన్నారు.