వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విడుదల 2’ నక్సలైట్ ఉద్యమానికి ఆధారంగా రూపొందిన శక్తివంతమైన చిత్రంగా నిలిచింది. 1987 నేపథ్యంలో అణగారిన వర్గాల బాధలను, కుల వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. స్కూల్ మాస్టర్‌గా ప్రారంభమైన పెరుమాళ్ జీవితం, నక్సలైట్ నాయకుడిగా మారే తీరు ఈ కథకు ప్రాణంగా నిలుస్తుంది. స్టోరీ లో ప్రతి అంశం ఎంతో అధ్బుతంగా, చాలా సహజంగా తెరకెక్కించారు.
విజయ్ సేతుపతి నటన విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉంది. ఈ మూవీలో అతను పెరుమాళ్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. హింసను ఎదుర్కొన్నా, తన లక్ష్యం కోసం వెనుకడుగు వేయని నాయకుడిగా అతని పోరాటం ఆవేశభరితంగా కనిపిస్తుంది.అతని వైవిద్యమైన నటన ఇందులో పెరుమాళ్ పాత్రకు ప్రాణం పోసింది.ఆయన నటన ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో హృదయాలను కదిలిస్తుంది. మంజు వారియర్ మహలక్ష్మిగా పవిత్ర ప్రేమకథను చక్కగా మేళవించింది. ఆమె పాత్ర వీర వనితగా మరింత బలంగా నిలిచింది.
పోలీసుల ఆగడాలు, దళ సభ్యుల పోరాటం, సామాన్యుల జీవన స్థితిగతుల నేపథ్యంలో పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూ వెట్రిమారన్ చేసిన ప్రతీ సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ఆయన గంభీరంగా ఆవిష్కరించారు. అయితే కథనంలో కొంత స్లో గా అనిపించవచ్చు. అయితే ఇటువంటి సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం ఈ మూవీ బాగా నచ్చుతుంది అన్నడంలో డౌట్ లేదు.
కథలో ప్రేమ, పోరాటాన్ని చాలా చక్కగా మిక్స్ చేయడంలో దర్శకుడి విజయం. అయితే నెరేషన్ కొద్దిగా నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీలా అనిపించడం మైనస్ పాయింట్లు. కానీ కథాసారాన్ని పటిష్ఠంగా నిలబెట్టే రిసెర్చ్, విజ్ఞానంతో వెట్రిమారన్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ‘విడుదల 2’ ఉద్యమ భావాలకు మద్దతుగా నిలుస్తుంది.
రేటింగ్ : 2.75/5