Saturday, April 17, 2021

విజయసాయి ఆశలపై ‘ఉక్కు’ ఉద్యమం నీళ్లు




మన కళ్ల ముందు అన్నీ అనుకూలoగానే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ మనకు తెలియకుండానే ఎక్కడో తేడా కొడుతుంది. అది అర్ధం చేసుకునే సరికి తెల్లారిపోతుంది. ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని విశాఖకు తరలించడానికి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదలు అక్కడ పరిస్థితిని అనుకూలoగా మార్చుకునేందుకు తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రపై ఫోకస్‌ పెట్టేలా బాధ్యతలు అప్పగించింది.

ఆయన కూడా తనకు చేతనైన స్థాయిలో పరిస్థితిని అనుకూలoగా మారుస్తూ వస్తున్నారు. అయితే పైకి అంతా అనుకూలoగా ఉన్నా.. లోపల మాత్రం తేడా కొడుతోందట. విజయసాయి ఉత్తరాంధ్ర సీఎం అన్నంతగా వ్యవహరిస్తుండడం అక్కడి స్థానిక నేతలకు మింగుడు పడడం లేదట. పైకి ఆయన ముందు నవ్వులు చిందిస్తున్నా.. లోపల మాత్రం వ్యతిరేకత బలoగా మారుతోంది. ఉత్తరాంధ్రలోని పరిపాలన అంతా ప్రస్తుతం విజయసాయి కనుసన్నలోనే నడుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఆయన వైఖరితో అధికారులు కూడా కూడా స్థానిక ప్రజా ప్రతినిధుల మాటలను లెక్క చేయడం లేదని అంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని విశాఖ ఎంపీ ఎంవీవీ సైతం పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం విశాఖ ఎన్నికల్లో తనకు కావాల్సిన వారి డివిజన్‌లో మాత్రమే ఆయన పర్యటిస్తున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మరికొందరు నాయకులు కూడా ఎంవీవీ లాగే హర్ట్‌ అవుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన విశాఖ జిల్లా సమీక్షలో సైతం స్వంత పార్టీ ఎమ్మెల్యేలే విజయసాయిని నిలదీయడం ఇందుకు బలాన్ని చేకూర్చే అంశం.

స్థానిక నాయకులను కలుపుకుని పోవాల్సిన విజయసాయిరెడ్డి మాత్రం పైకి అందరివాడుగా కనిపిస్తున్నా.. అధికారులకు మాత్రం ఎవరు చెప్పినా సరే జిల్లా స్థాయిలో తనకు తెలియకుండా ఏ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు విశాఖ ఉక్కు ఉద్యమం విషయంలో ప్రధాని వద్దకు అఖిపక్షాన్ని తీసుకు వెళ్లాల్సిందిగా నేతలు కోరగా, విజయసాయి మాత్రం ఉక్కు మంత్రి వద్దకు మాత్రమే తీసుకు వెళతానని చెప్పడంతో అఖిపక్షం నేతలు కూడా ఆయనపై మండి పడుతున్నారు.

ఉత్తరాంధ్రకు గుండెకాయ వంటి ‘ఉక్కు’ పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తమ పార్టీ కనుసన్నల్లోకి తీసుకోవటానికి విజయసాయి చేపట్టిన పాదయాత్ర కూడా పెద్దగా మైలేజీ తేక పోవడం పట్ల పార్టీ నేతలు కూడా నిరాశగా ఉన్నారట. దీన్ని గమనించిన విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి వద్ద తన పట్టు నిలుపుకోవటానికి విశాఖలో ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం కాకుండా ఆపగలరా లేదా అని ప్రజలు అడుగుతున్నారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడితే ఆ క్రెడిట్‌ విజయసాయికే దక్కుతుంది. అదే సమయంలో ఏమాత్రం తేడా కొట్టినా అది కూడా విజయసాయిరెడ్డి ఖాతాలోకే వెళ్లడం ఖాయం. చూడాలి విశాఖ విజయసాయి ఆశలపై ఏం చల్లుతుందో.




Related Articles

Latest Articles