
జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఉత్తమ నటులకు ప్రదానం చేయబడే గౌరవం. ఇది భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటి. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే ఈ అవార్డు విజయిగా నిలిచిన నటులకు ఎంతో గౌరవాన్ని తెస్తుంది. ఈ అవార్డు పొందినవారికి వెండి కమలం మెడల్‌తో పాటు రూ.50,000 నగదు పురస్కారం కూడా ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఈ పురస్కారాన్ని అందుకున్న నటులలో కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ ముగ్గురూ మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు.
ఇక 2023లో ఈ అవార్డును అల్లు అర్జున్ తన ‘పుష్ప’ సినిమాలోని నటనకు గానూ అందుకున్నారు. ఆయన పాత్రలో ప్రదర్శించిన విలక్షణమైన నటన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. అయితే, 2024లో విడుదలైన ‘పుష్ప 2’లో కూడా ఆయన నటన మరింత ప్రభావవంతంగా ఉండటంతో, మరోసారి జాతీయ అవార్డును గెలుచుకోవడం ఖాయమని అభిమానులు భావించారు. ఈ సినిమాలో జాతరలో వచ్చే ఫైట్ సీన్, క్లైమాక్స్‌లోని ఉద్వేగభరిత సన్నివేశాల్లో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతుందని, రెండోసారి జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంటారని సినీ వర్గాలు విశ్లేషించాయి.
అయితే, ఈసారి ఈ అవార్డుకు గట్టి పోటీ ఎదురుకానుంది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తన తాజా చిత్రం ‘ఛావా’ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర ప్రజలు దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇందులో విక్కీ కౌశల్ పోషించిన పాత్ర అత్యద్భుతంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా చివరి నలభై నిమిషాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది.
విక్కీ కౌశల్ పాత్రకు జీవం పోశారని, ఆయన నటనను మాటల్లో వర్ణించలేమని సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచినప్పటికీ, ఇది హిందీలో మాత్రమే విడుదల కావడం చిన్న మైనస్ అయ్యింది. కానీ, ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైతే మరింత గొప్ప స్పందన వచ్చేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ జాతీయ అవార్డు విషయంలో విక్కీ కౌశల్, అల్లు అర్జున్ ఇద్దరూ సమానంగా పోటీ ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ నటన మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నదంటే, మరోవైపు ‘ఛావా’లో విక్కీ కౌశల్ నటన విమర్శకులను ఆకర్షించింది. ఈ రెండు చిత్రాలు తమ కథనంతో, నటనతో సినీ ప్రపంచాన్ని ఆకర్షించాయి. అందువల్ల జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకుంటారో సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.