
‘లైలా’ సినిమా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందు ఈ సినిమా చాలా హైప్ క్రియేట్ చేసింది. పాటలు, టీజర్, ట్రైలర్..ఇలా అన్ని ఈ మూవీ పై మాంచి పాజిటివ్ హైప్ పెంచాయి . ముఖ్యంగా విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్ లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలకు తగ్గట్టుగా ఫలితం ఇవ్వలేకపోయింది.
సినిమా విడుదలకు ముందే దీనికి ‘A’ సర్టిఫికెట్ లభించింది. కానీ సినిమాపై వ్యతిరేక స్పందనలు ఎక్కువగా వచ్చాయి. అందులో రాజకీయ అంశాలు కూడా మిళితమయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కామెంట్ల ప్రకారం, వైసీపీ అభిమానుల నుంచి సినిమాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘డిజాస్టర్ లైలా’ హాష్‌ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవ్వడం గమనార్హం. ఇది సినిమా కంటెంట్‌తోనే సంబంధం ఉందా లేక ఇతర కారణాల వల్ల ఇదంతా జరుగుతోందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
సినిమా రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా ప్రీ-రిజ్లీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ చేసిన కొన్ని కామెంట్లు వివాదానికి దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీతో సంబంధం ఉన్నాయని అభిమానులు భావించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన ‘150 గొర్రెలు’ కామెంట్ పబ్లిక్‌లో రాజకీయ అర్థం కలిగి ఉన్నట్లు చర్చ జరిగింది. ఈ కామెంట్ 2019లో వైసీపీ సాధించిన 151 సీట్లను సూచిస్తుందని, అలాగే 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే రావడం కూడా ఈ కామెంట్‌లో ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో వైసీపీ అభిమానులు సినిమాపై వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు.
ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన తర్వాత #BoycottLaila అనే హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి అభిమానులను క్షమాపణలు కోరారు. సినిమాను రాజకీయం చేయొద్దని, ప్రొఫెషనల్‌గా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే సమయంలో విశ్వక్ సేన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక పోస్ట్ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ చర్య నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ వివాదం కొంత తగ్గిన తర్వాత పృధ్వీరాజ్ కూడా క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే సినిమాపై వ్యతిరేకత బలంగా ఏర్పడటంతో ప్రేక్షకులు దాన్ని పక్కన పెట్టేశారు.
మొత్తానికి ‘లైలా’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా, వివాదాల కారణంగా పూర్తిగా డిజాస్టర్‌గా మారిపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, అభిమానుల మద్దతు లేకపోతే ఏ సినిమా కూడా నిలబడలేదని ‘లైలా’ మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.