
విశ్వక్ సేన్ తన నటన, దర్శకత్వంతో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాకు సినిమా భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కొత్త ప్రయోగాలు చేస్తూ తన కెరీర్‌లో ముందుకెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్‌గా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించగా, విశ్వక్ ఇందులో లేడీ గెటప్‌లో కనిపించడం సినిమాకు హైలైట్ కావాల్సింది. కానీ, అది ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేదు.
సినిమా ప్రమోషన్లలో విశ్వక్ సేన్ ఎంతో కాన్ఫిడెంట్‌గా లైలా సినిమా అందరినీ అలరిస్తుందని, ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తుందని చెప్పాడు. అయితే ట్రైలర్ చూసిన చాలా మంది ఈ సినిమాలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో అని సందేహించారు. కానీ విశ్వక్ అప్పుడు అలాంటిదేమీ లేదని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పారు. కానీ, సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండిపోయింది.
సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో దీని గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది విశ్వక్ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా మిగిలిందని, ఇలాంటి అసభ్యకరమైన సినిమా ఎలా తీశారని ప్రశ్నించారు. సినిమా కథ, ప్రెజెంటేషన్, బలహీనమైన స్క్రీన్‌ప్లే అంతా కలిసి ఈ సినిమాను డిజాస్టర్‌గా మార్చేశాయి. విశ్వక్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో, తన అభిమానులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశాడు.
ఆ లేఖలో విశ్వక్ తన సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయలేకపోయిందని అంగీకరించాడు. అలాగే, తనపై నమ్మకంతో ఉన్న ప్రేక్షకులకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. తన లక్ష్యం ఎప్పుడూ కొత్తదనం అందించడమే అయినా, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవించాలని, ఇకపై తన ప్రతి సినిమా క్లాస్ అయినా, మాస్ అయినా అసభ్యత ఉండదని స్పష్టంగా చెప్పాడు.
అలాగే, “నేను ఒక సినిమా తీసినప్పుడు అది బాగాలేక పోతే .. విమర్శించే హక్కు మీకుంది. ఎందుకంటే నా కెరీర్ ప్రారంభం నుంచీ నన్ను ప్రేమతో ముందుకు నడిపింది మీరే. నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా కథే కాదు, ప్రతి ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకుల మనసుకు తాకేలా ఉండాలని నిర్ణయించుకున్నాను” అంటూ విశ్వక్ తన భావాలను వెల్లడించాడు.
అంతేకాకుండా, తనపై విశ్వాసం ఉంచిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియాలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. విశ్వక్ సేన్ ఈ నిర్ణయంతో తన భవిష్యత్ చిత్రాల్లో ఎలాంటి మార్పులు చేస్తాడో చూడాలి.