తన కెరీర్‌ను బ్రాండ్ ప్రమోటర్‌గా ప్రారంభించిన యష్, ఆ తర్వాత యాడ్‌ల ద్వారా కొంత గుర్తింపు పొందారు. టెలివిజన్ సీరియల్స్ ద్వారా దర్శకుల దృష్టిలో పడిన యష్, తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజిఎఫ్’ సినిమా యష్ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఈ సినిమా ద్వారా యష్ పాన్ ఇండియా హీరోగా మారి, భారతీయ సినీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈరోజు యష్ పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదే సమయంలో, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ అనే చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది. మరోవైపు, ఆయన బాలీవుడ్ హిందీ రామాయణం సినిమాలో రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం యష్ రూ.200 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
‘కేజిఎఫ్’ ముందు వరకు యష్ ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు తీసుకోగా, ఆ సినిమా విజయంతో రెమ్యూనరేషన్‌ను వందల కోట్లకు పెంచారు. ప్రస్తుతం యష్ ఆస్తుల విలువ సుమారు రూ.53 కోట్లు కాగా, హిందీ రామాయణం విడుదల తరువాత ఇది రూ.253 కోట్లకు చేరుతుందని అంచనా. ఆయనకు రూ.6 కోట్ల విలువైన గోల్ఫ్ రోడ్ సమీపంలోని విలాసవంతమైన ఇల్లు ఉంది. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి ఖరీదైన కార్లతో ఆయన గ్యారేజ్ నిండి ఉంది.
యష్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి 2017లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సమస్యలను పరిష్కరించడానికి ‘యశో మార్గ ఫౌండేషన్’ను స్థాపించారు. సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన యష్, రాజకీయాలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ప్రస్తుతం యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా ఆయన కెరీర్‌లో మరో కీలక మలుపు అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.