Saturday, April 17, 2021

ఆంధ్ర రాజకీయాల్లోనూ షర్మిళ ప్రస్తావన




నాలుక మడతేయడం అంటే రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాల్సిందే. ఈ విషయంలో వారిని మించిన వారు ఎంత వెతికినా దొరకరు. ఆ క్షణాన నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం… ఆ తర్వాత దాన్ని తమకు అనుకూలoగా మార్చుకుని పూర్తి విరుద్ధంగా మరో స్టేట్‌మెంట్‌ ఇవ్వడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను బాగా వంట బట్టించుకున్నట్టు ఉన్నాడు విజయవాడ ఎంపీ కేశినేని నాని. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్‌లో 6 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకున్నా.. కేశినేని మాత్రం టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

అప్పటి నుంచి పార్టీపై అలక బూనినట్లే కనిపిస్తున్నారు. ఇటీవల విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డప్పుడు కూడా నాని ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెబుతూ.. నా పార్లమెంట్‌ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా నేను ఎంపీగా గెలిచాను నాకు నీతులు చెప్పే స్థాయి ఎవరికీ లేదు అంటూ పార్టీ అధిష్ఠానానికే సవాల్‌ విసిరారు. అంటే పార్టీకన్నా నేనే తోపు.. తురుము అని చెప్పకనే చెప్పాడు. అలా అని రోజు గడిచాయో లేదో ఇప్పుడు పార్టీ అంటే కుటుంబం.

కుటుంబం అన్నాక అభిప్రాయ బేధాలు ఉండవా ఏంటి. జగన్‌ మోహన్‌రెడ్డి ఇంట్లో విభేదాలు లేవా ఏంటి?. ఆయన స్వంత చెల్లెలే వేరే పార్టీ పెడుతున్నారు అంటూ షర్మిలను కూడా ఈ వివాదాల్లోకి లాగడం విశేషం. ఇప్పటికే తెలoగాణ రాజకీయాల్లో వై.యస్‌. తనయ షర్మిల సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. తాజాగా కేశినేని నాని ఆమె గురించి ప్రస్తావించడంతో ఆంధ్రలో కూడా రాబోయే రోజుల్లో షర్మిల గురించి ఇతర పార్టీ వారు ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకూ జగన్‌ ఈ విషయంలో మౌనం వహించినా.. షర్మిళ ప్రస్తావన ఎక్కువయ్యే కొద్దీ ఆయన జవాబు చెప్పక తప్పదు.




Related Articles

Latest Articles