మనం చేయాలనుకునే ప్రతి పనికీ ఒక టైమింగ్ ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అయితే అది మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. లేకపోతే అనుకున్నది ఒకటి.. అయ్యేది మరోటి అన్న చందంగా మారుతుంది. దీన్నే సెల్ఫ్‌గోల్ అని కూడా అంటారు. ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఇలా సెల్ఫ్‌గోల్ చేసుకుని నానా తంటాలు పడుతున్నారు. విషయంలోకి వెళితే. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం సంగతి వెలివడినప్పటి నుంచీ ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం అట్టుడికిపోతోంది.
ఈ ప్లాంట్ పెట్టాలా వద్దా అనే మీమాంసలో అప్పటి కేంద్రం ఉండగా 32 మంది ప్లాంట్ కోసం బలిదానాలు చేయడంతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దీని కోసం 12 వేల ఎకరాలను స్థానికులు ఇచ్చారు. ఇప్పటికీ నిర్వాసితులకు, గ్రామాలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆ భూములు వేల కోట్లు పలుకుతున్నాయి. వీటి మీద కన్ను వేసిన కేంద్ర పెద్దల సన్నిహితులు ప్లాంట్‌ను కైవసం చేసుకోవటానికి పోస్కో కంపెనీని తెరమీదకు తెచ్చారనే వాదనలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర వరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే ప్రధాన అజెండా. ప్రచారంలో కూడా అధికార పార్టీ దీన్నే ప్రధానంగా ప్రచారం చేసింది. తాము ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెపుతూ వచ్చింది. ఇదే సమయంలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీతో పాటు ఇతర వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం తధ్యం అని ఖరాఖండిగా చెప్పేసింది.
ఇప్పటి వరకూ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రజల్లోకి వెళుతుంటే ఈ ఊహించని ఘటనతో అధికారపార్టీ ఇరుకున పడిoది. అనవసరంగా టైమింగ్ చూసుకోకుండా చేసిన పనివలన రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయోనని పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకుంటోంది. చూడాలి ఎంపీలు చేసిన ఈ పనికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో.