మనిషి మనుగడకు డబ్బు అవసరం ఎంతో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి చేతిలో రూపాయిలేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు మనలో చాలా మందికి అనుభవమే. అందుకే అంటారు లక్ష్మి తనదాకా రావడం వేరు.. వచ్చిన ఆమెను కళ్లకద్దుకుని కాపాడుకోవటం వేరు అని. ఇలా లక్ష్మి దేవి విలువ తెలుసుకుని మసుకున్న వారు జీవితంలో హాయి స్థిరపడతారు. ఈ సత్యాన్ని ఆచరణలో పెట్టిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన చిరంజీవికి రూపాయి విలువ బాగా తెలుసు. సంపాదించడం కాదు.. దాన్ని జాగ్రత్త చేయడంలోనే సంపాదించినంత ఫలం ఉంటుంది అని నమ్మే చిరంజీవికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇది.
రెండు వందల రెమ్యునరేషన్‌తో మొదలైన చిరు జీవితం వందల కోట్ల రూపాయలకు చేరడం వెనుక ఆయన తీసుకున్న జాగ్రత్తలు పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. చిరు తనకు సంబంధించిన ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుందని జేబులో ఎక్కువ డబ్బు పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అలాగే తన అలవాట్లను కూడా ఓ పరిధికి పరిమితం చేసేవారు. చిరంజీవికి అప్పట్లో సిగరెట్ కాల్చే అవాటు ఉండేది. ఈ అవాటు తన ఆర్థిక స్థాయిని ఎక్కడ మింగేస్తుందోనని భయపడిన చిరంజీవి తాను కొనుక్కున్న సిగరెట్ ప్యాకెట్‌ను తన మిత్రుడు రామకృష్ణంరాజు (ఇటీవల వరకూ ఆయన సారధిస్టూడియో బాధ్యతలు నిర్వహించారు) వద్ద ఉంచి.. అప్పుడప్పుడు ఒకటి అడిగి తీసుకునేవాడట.
ఈ విషయమై ఓసారి వీరి కామన్ ఫ్రెండ్ ఒకరు ఎందుకు ఇలా అని అడిగితే దానికి చిరంజీవి ‘‘చూడు నా జేబులో ఉందనుకో షాట్ గ్యాప్ వచ్చినప్పుడల్లా సిగరెట్ కాల్చాలి అనిపిస్తుంది. అటు డబ్బు దండగ, ఇటు అవాటు వ్యసనంగా మారే అవకాశం ఉంది. కెరీర్‌తోపాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే రాజు దగ్గర పెడుతున్నాను’’ అన్నారట. ఆర్ధిక విషయాల్లో అంత జాగ్రత్తగా ఉండబట్టే చిరంజీవి నటుడిగానే కాదు.. ఆర్థికంగా కూడా మెగా రేంజ్లో ఉన్నారు.