‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఒకటుంది.. ‘‘ఇప్పటి దాక ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’’ అని. ఇది రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాము అధికారంలో ఉంటే ఒక లెక్క.. అధికారంలో లేకపోతే ఒక లెక్క అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు. అధికారం చేతిలో ఉంటే.. తాము చెప్పిందే మాట.. చేసిందే చేత అన్నట్టుగా చెలరేగి పోతుంటారు. అంతేనా అధికారం నిలుపుకోవటానికి అనేక అడ్డదారులు, దొడ్డిదారులు తొక్కుతారు.
తీరా పవర్ చేజారాక ప్రత్యర్ధులు అదే మార్గాన్ని అనుసరిస్తారేమోనని కలవరపడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి కలవరపాటుకే గురౌతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల పాటు ఏక ఛక్రాధిపత్య పాలన సాగించిన ఆయన ఆ సమయంలో ప్రతిపక్షాల విషయంలో అనేక ఆపరేషన్‌లు సాగించి అటు కాంగ్రెస్‌ను, ఇటు తెలుగుదేశం పార్టీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు.
జగన్‌కు చేతకానిది రేవంత్ చేసి చూపించాడు!.
ఆయా పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను తన పార్టీ కండువాలు కప్పుకునేలా చేసి.. అసలు తెలంగాణ అంటే టీఆర్‌ఎస్ పార్టీనే అనే విధంగా కలరింగ్ ఇవ్వజూశారు. కేసీఆర్ చేతిలో అధికారం ఉండడంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర చోటా మోటా నాయకులు కూడా టీఆర్‌ఎస్ (అప్పటి) తీర్ధం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకటీ అరా తప్ప అందరూ విజయం సాధించి మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. దీంతో అధికారపార్టీ ఏ క్షణాన ఆకర్ష్ వల వేస్తుందో తెలియక కేసీఆర్ టెన్షన్‌పడిపోతున్నారు. తాను వల వేసినప్పుడు చిక్కుకున్న వారు ఇప్పుడు రేవంత్ వేస్తే మాత్రం చిక్కుకోకుండా ఉంటారని నమ్మటానికి కేసీఆర్ అంత అమాయకుడు కాదు.
పైగా కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌ను మించి కేవలం సీట్లు మాత్రమే ఉన్నాయి. మిత్ర పక్షం సీపీఐని కలుపుకుంటే మరో సీటు ఆధిక్యం అంతే. దీంతో ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు సజావుగా నడపాలంటే కాంగ్రెస్‌కు ఖచ్చితంగా ఆకర్ష్ వల వేయక తప్పదు. పైగా తనపై ఒంటికాలిపై లేచే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం కేసీఆర్‌కు మరింత ఇబ్బంది తెచ్చిపెట్టింది.
దీనికి తోడు అధికారం చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఇచ్చిన 6 హామీల్లో 2 హామీలను అమలు చేశాడు రేవంత్. అలాగే తాను కాలుజారి ఆస్పత్రిపాలు అయితే ఎవరూ ఊహించని విధంగా యశోదా హాస్పటల్‌కు వచ్చి మరీ పలకరించాడు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కూడా రేవంత్‌పట్ల సానుకూలత ఏర్పడిరది. ఇది కూడా కేసీఆర్‌కు కొంత ఇబ్బందికర అంశంమే.
మరోవైపు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు వంటి వాటిపై విచారణ కూడా చేపటట్టడానికి సిద్ధమౌతుండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత గడ్డుగా మారబోతోందనే వాస్తవం కేసీఆర్‌కు అర్ధమౌతోంది. ముందు ముందు రేవంత్ చర్యలు ఎలా ఉండబోతున్నాయో అని కేసీఆర్ కలవరపడుతున్నారట. రాజకీయాల్లో మంత్రదండం ఎవరి చేతుల్లో ఉంటే వారు ఏ మ్యాజిక్ కావాలంటే అది క్షణాల్లో జరిగిపోతుంది అంతే.