రాజకీయాల్లో కొన్ని భేటీలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. అసలు కలలో కూడా ఊహించని పరిణామాలు క్షణాల్లో జరిగిపోతుంటాయి. అలాంటి ఓ భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగడం చర్చకు దారితీస్తోంది.
ఇంతకీ ఈ భేటీలో పాల్గొన్నది ఎవరంటే పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బీటెక్ రవి, షర్మిళ భర్త బ్రదర్ అనీల్ కుమార్‌లు. బుధవారం ఉదయం వీరువురూ కడప ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఫొటోలు దిగడం..
అవి కాస్తా నెట్టింట వైరల్ కావడం జరిగిపోయింది. బుధవారం ఉదయం అటు బ్రదర్ అనిల్, ఇటు బీటెక్ రవిలు విజయవాడకు బయలుదేరారు. ఇరువురూ ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే ఒక్కరికొకరు ఎదురు పడ్డారు.
సహజంగా అయితే రాజకీయంగా వ్యతిరేక పార్టీల్లో ఉన్న వీరు చిరునవ్వు కూడా నవ్వుకోరు. కానీ ఇటీవల సంభవించిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిరువురూ ఒకరి నొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. అంతే కాదు కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
వీరు విజయవాడకు వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఇరువురు రాజకీయ చర్చల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా అనీల్ బీటెక్ రవితో షర్మిళ కాంగ్రెస్‌లో చేరితే ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు అన్నారట. దీనికి రవి మంచి పరిణామమే కదా.
రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు. ఆవిడ రాక రాజకీయాలకు మంచిదే అన్నారట. దీనికి స్పందించిన అనిల్ ఆమె పీసీసీ అధ్యక్షురాలైతే ఎలా ఉంటుంది అని కూడా అన్నట్లు సమాచారం.
దీనికి రవి అది మీకు, మీరు చేరబోయే పార్టీకి సంబంధించిన వ్యవహారం బాగుంటుంది అనిపిస్తేనే కదా మీరు ఆ పదవి గురించి అధిష్ఠానంతో చర్చించింది.
పీసీసీ అధ్యక్షురాలు అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. రాజశేఖరరెడ్డి కూతురుగా మీ వైఫ్‌కు ఆ అర్హత ఉంది అన్నారట.
అప్పటికే వెళ్లాల్సిన ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది అని తెలియడంతో ఇద్దరూ ఫ్లైట్‌లోకి వెళ్లారు. ఇద్దరివీ వేరే వేరే సీట్లు కావడంతో ఎవరి సీట్లో వారు కూర్చున్నారట. గన్నవరంలో దిగిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారట.
ఇదంతా చూసిన తోటి ప్రయాణికులు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని కలుస్తారో.. ఎవరు ఎవరిని వదిలేసి వెళ్లిపోతారు చెప్పడం కష్టమే అని చర్చించుకున్నారట.